
క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్ (క్విప్) మార్గంలో ఇన్వెస్టర్లకు ఈక్విటీ షేర్లను విక్రయించడం ద్వారా రియల్ ఎస్టేట్ డెవలపర్లు గతేడాది రూ. 22,320 కోట్లు సమీకరించాయి. 2024లో అన్ని రంగాలు కలిసి 99 క్విప్ ఇష్యూల ద్వారా మొత్తం రూ. 1,41,482 కోట్లు సమకూర్చుకున్నాయి. ఇందులో రియల్ ఎస్టేట్ రంగం అగ్రస్థానంలో నిల్చింది. 8 డెవలపర్లు, 1 రీట్ (రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్) కలిసి రూ. 22,320 కోట్లు సమీకరించాయి.
క్విప్ ద్వారా వచ్చిన మొత్తం నిధుల్లో ఇది 16 శాతం. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అనరాక్ విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. మార్కెట్లలో హెచ్చుతగ్గులు నెలకొన్నప్పటికీ క్యాపిటల్ మార్కెట్లు పటిష్టంగానే ఉన్నాయని, కంపెనీలు భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయని అనరాక్ చైర్మన్ అనుజ్ పురి చెప్పారు.
రియల్ ఎస్టేట్ రంగం వృద్ధి అవకాశాలపై సంస్థాగత ఇన్వెస్టర్లు అత్యంత బుల్లిష్‌గా ఉన్నట్లు వివరించారు. వివిధ రంగాలు 2020లో ఆల్‌టైం గరిష్ట స్థాయిలో క్విప్ మార్గంలో రూ. 80,816 కోట్లు సమీకరించాయి. 2024 గణాంకాలు దాని కన్నా 75 శాతం అధికం కావడం గమనార్హం. 2025లో క్విప్ ఫండింగ్ మిశ్రమంగా ఉండొచ్చని పురి తెలిపారు.
నివేదిక ప్రకారం .. గోద్రెజ్ ప్రాపర్టీస్ రూ. 6,000 కోట్లు, ప్రెస్టీజ్ ఎస్టేట్స్ రూ. 5,000 కోట్లు, బ్రూక్‌ఫీల్డ్ ఇండియా రీట్ రూ. 3,500 కోట్లు, మ్యాక్రోటెక్ డెవలపర్స్ రూ. 3,300 కోట్లు, బ్రిగేడ్ ఎంటర్‌ప్రైజెస్ రూ. 1,500 కోట్లు సమీకరించాయి.
Comments
Please login to add a commentAdd a comment