Pre-Budget 2023: బడ్జెట్లో పన్నులు తగ్గించాలి

ఉపాధి కల్పన పెంచాలి
మరిన్ని నిధులు ఖర్చు చేయాలి
బడ్జెట్ ముందస్తు భేటీల్లో వినతులు
న్యూఢిల్లీ: వ్యక్తిగత ఆదాయపన్ను తగ్గించాలన్నది బడ్జెట్‌కు ముందు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ముందుకు వచ్చిన ప్రధాన డిమాండ్లలో ఒకటి. అలాగే, మరింత మందికి ఉపాధి కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని, ఆర్థిక వ్యవస్థకు చేదోడుగా మరిన్ని నిధులను ఖర్చు చేయాలని, పలు రంగాలకు ప్రోత్సాహకాలు కల్పించాలన్న డిమాండ్లు వచ్చా యి. కేంద్ర ఆర్థిక శాఖ 2023–24 బడ్జెట్‌కు ముందు వివిధ భాగస్వాములు, పరిశ్రమలతో సంప్రదింపులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 21న పలు రంగాల పరిశ్రమల ప్రతినిధులతో చర్చలు మొదలు పెట్టారు. సోమవారం ఆర్థికవేత్తల అభిప్రాయాలను తెలుసుకోవడం ద్వారా చర్చలను ముగించారు. వచ్చే ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను మంత్రి సీతారామన్ పార్లమెంట్‌కు సమర్పించనుండడం గమనార్హం. ఎంఎస్‌ఎంఈలకు గ్రీన్ సర్టిఫికేషన్, పట్టణ నిరుద్యోగుల కోసం ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టాలని, ఆదాయపన్నును క్రమబద్ధీకరించాలనే డిమాండ్లు వచ్చినట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటన విడుదల చేసింది. దేశీయంగా సరఫరా వ్యవస్థ బలోపేతం, ఎలక్ట్రిక్ వాహనాలపై పన్నుల తగ్గింపు, ఈవీ విధానాన్ని ప్రకటించడం, గ్రీన్ హైడ్రోజన్‌కు భారత్‌ను కేంద్రం చేయడం, చిన్నారులకు సామాజిక భద్రత ప్రయోజనం, ఈఎస్‌ఐసీ కింద అసంఘటిత రంగ కార్మికులకు కవరేజీ కల్పించాలన్న డిమాండ్లు కూడా వచ్చాయి.