కోవిడ్-19కు తొలి వ్యాక్సిన్ రెడీ: ఫైజర్

Pfizer inc applied  to USFDA for vaccine emergency usage - Sakshi

వ్యాక్సిన్ వినియోగానికి యూఎస్ఎఫ్డీఏకు ఫైజర్ దరఖాస్తు

అత్యవసర వినియోగానికి అనుమతించమని కోరిన కంపెనీ

ఈ ఏడాది చివరికల్లా 5 కోట్ల డోసేజీలు సిద్ధమంటున్న ఫైజర్

మూడో దశ క్లినికల్ పరీక్షల తొలి డేటాలో 95 శాతం సత్ఫలితాలు

న్యూయార్క్: కోవిడ్-19 చికిత్సకు తొలి వ్యాక్సిన్ సిద్ధమైంది. మెసెంజర్ ఆర్ఎన్ఏ ఆధారంగా రూపొందించిన తమ వ్యాక్సిన్ ను అత్యవసర వినియోగానికి అనుమతించమంటూ గ్లోబల్ ఫార్మా దిగ్గజం ఫైజర్ ఇంక్ శుక్రవారం దరఖాస్తు చేసుకుంది. ఈ దరఖాస్తును వచ్చే నెలలో యూఎస్ఎఫ్డీఏ సలహా కమిటీ సమీక్షించనున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 8-10 మధ్య కాలంలో సమీక్ష ఉండవచ్చని సంబంధిత వర్గాలు తెలియజేశాయి. తద్వారా కరోనా వైరస్ కట్టడికి వ్యాక్సిన్ ను రూపొందించిన తొలి కంపెనీగా ఫైజర్ రికార్డ్ సాధించనున్నట్లు ఫార్మా నిపుణులు పేర్కొన్నారు. ప్రపంచ దేశాలను వణికిస్తున్న కోవిడ్-19 కట్టడికి పలు గ్లోబల్ ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్లను రూపొందిస్తున్న విషయం విదితమే. జర్మన్ కంపెనీ బయోఎన్టెక్ తో భాగస్వామ్యంలో రూపొందిస్తున్న వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ పరీక్షలలోనూ 95 శాతం ఫలితాలను సాధించినట్లు ఫైజర్ ఇటీవల వెల్లడించింది. మూడో దశ పరీక్షల తొలి ఫలితాల ఆధారంగా తమ వ్యాక్సిన్ సత్ఫలితాలు సాధిస్తున్నట్లు ఫైజర్ తెలియజేసింది.

5 కోట్ల డోసులు
యూఎస్, బెల్జియంలలో వినియోగానికి ఈ ఏడాది చివరికల్లా 5 కోట్ల డోసేజీలను అందించగలమని ఫైజర్, బయోఎన్టెక్ తాజాగా తెలియజేశాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో సురక్షితమైన, సత్ఫలితాలు ఇవ్వగల వ్యాక్సిన్లను అందించేందుకు చూస్తున్నట్లు ఫైజర్ ఇంక్ చైర్మన్ ఆల్బర్ట్ బోర్ల పేర్కొన్నారు. తమ వ్యాక్సిన్ భద్రత, ప్రభావాలపై తమకు పూర్తి అవగాహన ఉన్నట్లు తెలియజేశారు. వ్యాక్సిన్ వినియోగానికి అనుమతించమంటూ యూరోపియన్, యూకే ఔషధ నియంత్రణ సంస్థలకు సైతం తాము దరఖాస్తు చేయనున్నట్లు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా పలు ఇతర దేశాలలో నియంత్రణ సంస్థలకూ దరఖాస్తు చేయనున్నట్లు వివరించారు.

అయితే ఫైజర్ తయారీ వ్యాక్సిన్ ను -80-94 సెల్షియస్ లో నిల్వ చేయవలసి ఉన్నందున కంపెనీ ఇందుకు అవసరమైన కూలింగ్ సిస్టమ్స్ ను సైతం సిద్ధం చేసింది. దేశవ్యాప్తంగా వ్యాక్సిన్లను పంపిణీ చేసేందుకు వీలుగా డ్రై ఐస్ తో కూడిన సూపర్ కూల్ స్టోరేజీ యూనిట్లను రూపొందించింది. కాగా.. ఇటీవల తమ వ్యాక్సిన్ 94 శాతంపైగా ఫలితాలను సాధించినట్లు వెల్లడించిన ఫార్మా దిగ్గజం మోడర్నా ఇంక్ సైతం ఫైజర్ బాటలో త్వరలోనే యూఎస్ఎఫ్డీఏకు దరఖాస్తు చేయనున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top