
సుమారు 48 రోజులపాటు నిలకడను ప్రదర్శించిన పెట్రోల్, డీజిల్ ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి.
న్యూఢిల్లీ, సాక్షి: సుమారు 48 రోజులపాటు నిలకడను ప్రదర్శించిన పెట్రోల్, డీజిల్ ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. ప్రభుత్వ రంగ చమురు దిగ్గజాలు తాజాగా రేట్లను పెంచాయి. దీంతో న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 17 పైసలు పెరిగి 81.23ను తాకింది. ఈ బాటలో డీజిల్ ధరలు సైతం లీటర్‌కు 22 పైసలు అధికమై 70.68కు చేరాయి. అయితే వ్యాట్ తదితరాల నేపథ్యంలో రాష్ట్రాలవారీగా పెట్రోల్, డీజిల్ ధరలలో వ్యత్యాసాలు నమోదయ్యే సంగతి తెలిసిందే.
కాగా.. ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ 22 పైసలు పెరిగి రూ. 85.47కు చేరగా.. డీజిల్ ధరలు మరింత అధికంగా 28 పైసలు బలపడి రూ. 77.12ను తాకినట్లు తెలుస్తోంది.పెట్రోల్, డీజిల్ ధరల్లో వివిధ పన్నులే 70 శాతం వరకూ వాటాను ఆక్రమిస్తుంటాయని ఈ సందర్భంగా పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. తాజాగా నాలుగు మెట్రోలలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా నమోదయ్యాయంటే.. ముంబైలో పెట్రోల్ లీటర్ రూ. 87.92కు చేరగా.. డీజిల్ రూ. 77.11ను తాకింది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 84.31కాగా.. డీజిల్ రూ. 76.17గా ఉంది. ఇక కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ. 82.79కాగా.. డీజిల్ రూ. 74.24కు చేరింది.
విదేశీ ఎఫెక్ట్
విదేశీ మార్కెట్లో ముడిచమురు ధరల ఆధారంగా దేశీయంగా పెట్రో ఉత్పత్తుల ధరలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సవరిస్తుంటాయి. ప్రస్తుతం లండన్ మార్కెట్లో బ్రెంట్ చమురు బ్యారల్ 0.25 శాతం పెరిగి 44.30 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక న్యూయార్క్ మార్కెట్లో నైమెక్స్ బ్యారల్ 41.74 డాలర్ల వద్ద కదులుతోంది. డాలరుతో మారకంలో రూపాయి విలువ, దేశీయంగా పన్నులు తదితర పలు అంశాలు ఇండియన్ క్రూడ్ బాస్కెట్ ధరలను ప్రభావితం చేసే సంగతి తెలిసిందే. ఈ అంశాల ఆధారంగా చమురు పీఎస్‌యూలు.. బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఐవోసీ పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తుంటాయి.