భారతీయ డిజిటల్ చెల్లింపుల దిగ్గజం పేటీఎం సరికొత్త పునర్నిర్మాణ వ్యూహంతో ముందుకు సాగుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఆధారిత ఉత్పత్తుల అభివృద్ధి, మర్చంట్ నెట్‌వర్క్ విస్తరణే లక్ష్యంగా కంపెనీ తన శ్రామిక శక్తిని సుమారు 10 శాతం మేర పెంచుకోవాలని నిర్ణయించింది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. రాబోయే తొమ్మిది నెలల్లో (మార్చి 2027 నాటికి) కొత్తగా సుమారు 4,000 మంది ఉద్యోగులను నియమించుకోవడానికి కంపెనీ ప్రణాళికలు సిద్ధం చేసింది.
అయితే, ఒకవైపు భారీ నియామకాలు చేపడుతూనే.. మరోవైపు అంతర్గత పునర్నిర్మాణంలో భాగంగా దాదాపు 400 మంది ఉద్యోగులను (మొత్తం సిబ్బందిలో 1 శాతం) తొలగించేందుకు సంస్థ సిద్ధమవడం కార్పొరేట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
కీలక అంశాలు..
భారీ నియామకాలు: రాబోయే 9 నెలల్లో 4,000 మంది కొత్త సిబ్బంది రిక్రూట్మెంట్. ఇప్పటికే గత రెండు నెలల్లో 800 మందికి పైగా నియామకం పూర్తి.
ఉద్యోగాల కోత: వార్షిక పనితీరు మదింపు ఆధారంగా ఎంపిక చేసిన విభాగాల్లో 400 మంది తొలగింపు.
ప్రస్తుత ఉద్యోగుల సంఖ్య: ప్రస్తుతం కంపెనీలో 40,000 మందికి పైగా సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. నూతన నియామకాలతో ఈ సంఖ్య మరింత పెరగనుంది.
ప్రధాన దృష్టి: సీనియర్ లీడర్‌షిప్ పాత్రలతో పాటు.. ప్రొడక్ట్, టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగాల బలోపేతం.
సరికొత్త ప్లాన్
2010లో విజయ్ శేఖర్ శర్మ స్థాపించిన పేటీఎం మొబైల్ రీఛార్జ్‌లతో ప్రారంభమై 2016 నోట్ల రద్దు తర్వాత దేశీయ ఫిన్‌టెక్ రంగంలో తిరుగులేని శక్తిగా ఎదిగింది. అయితే, గత రెండేళ్ల క్రితం పేటీఎం బ్యాంకింగ్ విభాగంపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ కఠిన నిబంధనలు విధించడం, ఆపై లైసెన్స్ రద్దు చేయడంతో కంపెనీ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంది. ఆ సమయంలో దాదాపు 4,500 మందికి పైగా సిబ్బందిని తగ్గించుకోవాల్సి వచ్చింది.
ఆ నియంత్రణ సవాళ్ల నుంచి కోలుకున్న పేటీఎం వరుసగా నాలుగు త్రైమాసికాల్లో లాభాలను నమోదు చేస్తూ మళ్లీ ట్రాక్‌లోకి వచ్చింది. ఇప్పుడు కంపెనీకి ఉన్న రిజిస్టర్డ్ వినియోగదారులను కేవలం చెల్లింపులకే పరిమితం చేయకుండా.. రుణాలు, పెట్టుబడి ఉత్పత్తులు, ఇతర ఆర్థిక సేవలను విస్తృతంగా అందించడంపై దృష్టి సారించారు.
ఇదీ చదవండి: ఒక్కసారిగా తిరగబడిన బంగారం ధరలు


