
హైదరాబాద్ నగరంతోపాటు శివారు ప్రాంతాల్లో వేగంగా పెరుగుతున్న సీఎన్జీ వాహనాల సంఖ్యకు అనుగుణంగా గ్యాస్ స్టేషన్ల విస్తరణ జరగకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం నగర పరిధిలో కేవలం 83 సీఎన్జీ స్టేషన్లే ఉన్నాయి. ఇవి రోజూ 55 వేల నుంచి 60 వేల వాహనాలకు గ్యాస్ సేవలు అందిస్తున్నాయని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు.
లోక్‌సభలో బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో పలు కీలక వివరాలు వెల్లడించారు. హైదరాబాద్‌లో ప్రజారవాణా వాహనాలు, ఆటోలు, ప్రైవేట్ వాహనాలు అధికంగా సీఎన్జీపైనే ఆధారపడుతున్నాయి. కానీ స్టేషన్ల తక్కువ సంఖ్య వల్ల వాహనదారులు గంటలకొద్దీ క్యూ లైన్లలో నిలబడాల్సి వస్తోందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి లోక్‌సభ వేదికగా తెలిపారు.