ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తున్నారా ఏంటి? | Online Shoppers Lose Up To Rs 28000 Crore Annually Due To Deceptive Digital Practices | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తున్నారా ఏంటి?

Jun 9 2026 8:19 PM | Updated on Jun 9 2026 8:35 PM

 Online Shoppers Lose Up To Rs 28000 Crore Annually Due To Deceptive Digital Practices

ప్రస్తుత కాలంలో ఆన్‌లైన్‌ ద‍్వారా వస్తువులు కొనుగోలు చేసేవారు విపరీతంగా పెరిగిపోయారు. అయితే, ఇలా కొనుగోళ్లు చేస్తున్న వారిలో ప్రతిరోజు ఎంతో కొంత మోసపోతూనే ఉన్నారు. ఉదాహరణకు.. ఆన్‌లైన్‌లో ఏదైనా వస్తువు కొనుగోలు చేస్తున్నప్పుడు మొదట రూ.499 అని కనిపిస్తుంది. కానీ, చెల్లింపు చేసే చివరి దశకు వెళ్లేసరికి డెలివరీ ఛార్జీ, ప్లాట్‌ఫాం ఫీజు, ప్యాకేజింగ్ ఫీజు అంటూ ధర రూ.600 దాటిపోతుంది. మరికొన్ని సార్లు "ఇంకా 2 నిమిషాల్లో ఆఫర్ ముగుస్తుంది", "ఈ వస్తువును 20 మంది చూస్తున్నారు" వంటి సందేశాలు చూపించి వెంటనే కొనుగోలు చేయాలనే ఒత్తిడి, ఆత్రుతను తీసుకొస్తారు. 

వినియోగదారులను ఇలాంటి పద్ధతులతో ప్రభావితం చేసే డిజిటల్ వ్యూహాలను "డార్క్ ప్యాటర్న్స్" అంటారు. ఈ మోసపూరిత పద్ధతుల వల్ల భారత్‌లో ఆన్‌లైన్ కొనుగోలుదారులు ప్రతి ఏడాది వేల కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు చేస్తున్నట్లు తాజా డాటమ్ ఇంటెలిజెన్స్ నివేదిక వెల్లడించింది. వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా రూపొందించిన డిజిటల్ డిజైన్ పద్ధతులను కంపెనీలు పాటిస్తూ కస్టమర్లను మోసగిస్తున్నాయి.

"డార్క్ ప్యాటర్న్స్" అని పిలిచే మోసపూరిత ఆన్‌లైన్ డిజైన్ పద్ధతుల వల్ల వినియోగదారులు ప్రతి ఏడాది రూ. 25,000 కోట్ల నుంచి రూ. 28,000 కోట్ల మధ్య నష్టపోతున్నారని డాటమ్ ఇంటెలిజెన్స్ నివేదిక తెలిపింది. డార్క్ ప్యాటర్న్స్ ఇన్ ఇండియాస్ ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేసెస్ పేరుతో విడుదలైన నివేదిక ప్రకారం.. భారత్‌లోని 304 మిలియన్ల ఆన్‌లైన్ కొనుగోలుదారుల్లో దాదాపు 88 శాతం మంది హిడెన్‌ (మనకు ముందు తెలియని) ఛార్జీలు, తప్పనిసరి అదనపు సేవలు, డ్రిప్ ప్రైసింగ్, సబ్‌స్క్రిప్షన్ వంటి పద్ధతుల కారణంగా నెలకు సగటున రూ.78 నుంచి రూ.87 వరకు అదనపు ఖర్చు భరిస్తున్నారు. డ్రిప్ ప్రైసింగ్ అంటే ప్రారంభంలో ధర తక్కువగా చూపించి, చివరి దశల్లో అదనపు ఛార్జీలు చేర్చే విధానం.

మోసపూరిత డిజిటల్ పద్ధతులను అడ్డుకోవడంలో ప్రస్తుతం ఉన్న నియంత్రణ చర్యలు కొద్ది మేరకే ప్రభావం చూపుతున్నాయని నివేదిక పేర్కొంది మోసపూరిత డిజిటల్ పద్ధతులపై భారీ జరిమానాలు అవసరమని చెప్పింది. అలాగే, అమలు చేయడానికి వీలుగా ఉన్న నిబంధనలు అవసరమని సూచించింది.

50 నగరాల్లోని 2,590 మంది వినియోగదారులపై నిర్వహించిన సర్వేలో, ఆన్‌లైన్ చెల్లింపులు చేసే వారిలో దాదాపు 63 శాతం మంది హిడెన్‌ ఛార్జీలు లేదా డ్రిప్ ప్రైసింగ్‌ను ఎదుర్కొన్నట్లు వెల్లడైంది. ఇందులో అదనపు ఖర్చులు కొనుగోలు ప్రక్రియ చివరి దశల్లో మాత్రమే కనిపిస్తాయి. 2024లో నమోదైన 52 శాతంతో పోలిస్తే ఇది బాగా పెరిగింది. 73 శాతం వరకు వినియోగదారులపై ఒత్తిడి తెచ్చే ఫోర్స్డ్-యాక్షన్ పద్ధతులు వాడుతున్నట్లు నివేదిక వెల్లడించింది. ఇవి వినియోగదారులు సాధారణంగా తీసుకోని నిర్ణయాలు తీసుకునేలా ఒత్తిడి పెడతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement