ఆన్‌లైన్‌ స్కిల్‌ గేమింగ్‌ను వేరుగా చూడాలి

Online Gaming: Tax fantasy, skill games separately - Sakshi

కేంద్ర ఆర్థిక శాఖకు పరిశ్రమ వినతి

న్యూఢిల్లీ: గేమింగ్‌ పరిశ్రమను 28 శాతం జీఎస్‌టీ పరిధిలోకి తీసుకొస్తూ ఇటీవలే జీఎస్‌టీ కౌన్సిల్‌ తీసుకున్న నిర్ణయాన్ని పరిశ్రమలోని కొన్ని వర్గాలు విభేధిస్తున్నాయి. ఏ గేమ్‌ అన్న దానితో సంబంధం లేకుండా గేమింగ్‌ పరిశ్రమ మొత్తాన్ని గరిష్ట పన్ను పరిధిలోకి తీసుకురావడం తెలిసిందే. దీన్ని సుమా రు 120 ఆన్‌లైన్‌ క్యాజువల్‌ స్కిల్‌ గేమింగ్‌ కంపెనీలు వ్యతిరేకిస్తున్నాయి. పన్ను విషయంలో ఫ్యాంటసీ స్పోర్ట్స్‌ నుంచి తమను (స్కిల్‌ గేమింగ్‌/నైపుణ్యాలను పెంచుకునేవి) వేరుగా చూడాలని కోరు తూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రికి, జీఎస్‌టీ కౌన్సిల్‌ సభ్యులకు లేఖ రాశాయి.

అంతర్జాతీయంగా ప్రైజ్‌ మనీతో కూడిన ఫ్యాంటసీ స్పోర్ట్స్‌పై పన్ను అనేది ఆన్‌లైన్‌ స్కిల్‌ గేమింగ్‌తో పోలిస్తే భిన్నంగా ఉన్నట్టు మంత్రి దృష్టికి తీసుకెళ్లాయి. లాటరీలు, ఫ్యాంటసీ స్పోర్ట్స్‌తో పోలిస్తే ఆన్‌లైన్‌ స్కిల్‌ గేమింగ్‌ వినియో గం భిన్నంగా ఉంటుందని వివరించాయి. అలాగే, వ్యాపార నమూనా, సామాజిక ఔచిత్యం వేర్వేరు అని పేర్కొన్నాయి. రియల్‌ మనీ గేమింగ్‌ పరిశ్రమలో ఫ్యాంటసీ స్పోర్ట్స్‌ అనేది ప్రత్యేక విభాగమని పరిశోధనా సంస్థలైన కేపీఎంజీ, రెడ్‌సీర్‌ సైతం వర్గీకరించినట్టు తెలిపాయి. ఆన్‌లైన్‌ స్కిల్‌ గేమింగ్‌ పూర్తి విలువపై 28 శాతం జీఎస్‌టీ అనేది పరిశ్రమకు మరణశాసనంగా మారుతుందని ఈ సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. కనుక పరిశ్రమ మనుగడకు వీలుగా తమపై పన్ను భారాన్ని తగ్గించాలని కోరాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top