Online gaming industry: రూ.29వేల కోట్లుకు చేరనున్న గేమింగ్‌ మార్కెట్‌

Online gaming industry to worth Rs 29000 crore by 2025 in india  - Sakshi

2025 నాటికి విస్తరిస్తుందన్న అంచనాలు

న్యూఢిల్లీ: దేశంలో గేమింగ్‌ మార్కెట్‌ శరవేగంగా విస్తరిస్తోంది. 2025 నాటికి 3.9 బిలియన్‌ డాలర్లకు (రూ.29,000 కోట్లు సుమారు) చేరుకుంటుందని ఐఏఎంఏఐ వన్‌ప్లస్, రెడ్‌సీర్‌ సంయుక్తంగా విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నాయి.

గేమింగ్‌ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్ల నుంచి ఎంతో ఆసక్తి కనిపిస్తోందని.. గడిచిన ఆరు నెలల్లోనే ఈ పరిశ్రమలోకి బిలియన్‌ డాలర్ల మేర పెట్టుబడులు వచ్చినట్టు తెలిపింది. ‘‘భారత్‌లో ప్రస్తుతం మొబైల్‌ గేమర్లు (మొబైల్‌పై గేమ్‌లు ఆడేవారు) 43 కోట్ల మంది ఉన్నారు. 2025 నాటికి ఈ సంఖ్య 65 కోట్లకు పెరుగుతుంది. గేమింగ్‌ రంగాన్ని ప్రస్తుతం మొబైల్‌ గేమింగ్‌ శాసిస్తోంది. ప్రస్తుతం గేమింగ్‌ పరిశ్రమ 1.6 బిలియన్‌ డాలర్ల మేర ఉంటే.. ఇందులో మొబైల్‌ గేమింగ్‌ వాటా 90 శాతంగా ఉంది’’అంటూ ఈ నివేదిక పేర్కొంది.

గేమింగ్‌ను అమితంగా ప్రేమించే వారిలో 40 శాతం మంది సగటున ప్రతీ నెలా రూ.230 చొప్పున ఇందుకు ఖర్చు చేస్తున్నట్టు తెలిపింది. ‘‘కరోనా మహమ్మారి డిజిటల్‌ గేమ్స్‌ వృద్ధికి సాయపడింది. యాప్‌ డౌన్‌లోడ్‌లు 50 శాతం పెరిగాయి’’ అని వివరించింది. గడిచిన కొన్నేళ్లలో ఈ–గేమింగ్‌ పరిశ్రమ అద్భుతంగా వృద్ధి చెందినట్టు వన్‌ప్లస్‌ ఇండియా చీఫ్‌ స్ట్రాటజీ ఆఫీసర్‌ నవీన్‌ నక్రా పేర్కొన్నారు.

గేమింగ్‌ పరికరాలకూ పీఎల్‌ఐ పథకం! 
ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకాన్ని గేమింగ్‌ పరికరాల తయారీకి విస్తరించాలనే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ విషయాన్ని ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖ సంయుక్త కార్యదర్శి సౌరభ్‌గౌర్‌ తెలిపారు. ఐఏఎంఏఐ నిర్వహించిన ఒక కార్యక్రమంలో గౌర్‌ పాల్గొన్నారు. ‘‘గేమింగ్‌ కన్సోల్స్‌కు ఎంతో ఆదరణ ఉంది. ట్యాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లు ఇతర వనరులుగా ఉన్నాయి. దేశం లో గేమింగ్‌ వ్యవస్థకు ప్రోత్సాహం, బలోపేతానికి వీలుగా సమాచార శాఖ, సాంస్కృతిక శాఖతో కలిసి చర్యలు తీసుకుంటున్నాం’’ అని గౌర్‌ చెప్పారు.

చదవండి: జస్ట్‌ ఒక్క మొబైల్‌ గేమ్‌తో 75 వేల కోట్లు సొంతం...!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top