
క్రెడిట్ స్కోర్, హిస్టరీ అనేది బ్యాంకులు, ఇతర రుణ సంస్థల నుంచి లోన్ పొందడంలో కీలకంగా మారింది. అయితే తొలిసారి రుణం కోసం దరఖాస్తు చేసుకునేవారికి ఎలాంటి క్రెడిట్ హిస్టరీ ఉండదు. ఇలాంటి వారికి క్రెడిట్ హిస్టరీ లేదన్న కారణంతో లోన్ మంజూరు చేయకుండా రుణ సంస్థలు తిరస్కరిస్తాయన్న ఆందోళన ఉంటుంది. దీనికి సంబంధించి తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వైఖరిని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.
మొదటిసారి రుణగ్రహీతలకు క్రెడిట్ హిస్టరీ లేనందున రుణ దరఖాస్తును తిరస్కరించరాదని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది, ఇటీవల పార్లమెంటులో ఒక ప్రశ్నకు సమాధానంగా ఆర్థిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి క్రెడిట్ స్కోర్ కు సంబంధించిన అనేక అంశాలను స్పష్టం చేశారు. సిబిల్ నివేదికలు, క్రెడిట్ రిపోర్టులను జారీ చేయడానికి అధీకృత ఏజెన్సీలు, మొదటిసారి రుణానికి దరఖాస్తు చేయడానికి క్రెడిట్ హిస్టరీ తప్పనిసరా వంటి వాటిపై స్పష్టత ఇచ్చారు.
2025 జనవరి 6న ఆర్బీఐ విడుదల చేసిన మాస్టర్ డైరెక్షన్ ప్రకారం, అన్ని క్రెడిట్ ఇన్‌స్టిట్యూషన్లు (CI) తమ విధానాల్లో ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఆర్బీఐ పేర్కొన్న ప్రకారం, కనీస క్రెడిట్ స్కోరు అవసరం లేదు. అంటే ఆర్బీఐ ఎలాంటి క్రెడిట్ స్కోరు నిర్దేశించలేదు. కాబట్టి బ్యాంకులు తమ సొంత వాణిజ్య పరమైన విధానాల ఆధారంగా రుణ దరఖాస్తులను పరిశీలించవచ్చు.