Nikhil Kamath of Zerodha Networth Tells Where to Put Your Money - Sakshi
Sakshi News home page

జెరోధా నితిన్‌ నెల జీతం ఎంతో తెలుసా? ఈ తప్పులు చేయొద్దన్న బిలియనీర్‌

Published Sat, Mar 4 2023 9:15 PM

Nikhil Kamath of Zerodha networth  tells where to put your money - Sakshi

దేశీయ అతిపెద్ద స్టాక్ బ్రోకరేజ్ సంస్థ జెరోధా సీఈవో నితిన్‌ కామత్ స్వయం కృషితో ఎదిగిన సెల్ఫ్‌ మేడ్‌ బిలియనీర్‌ అనడంలో  ఎలాంటి అతిశయోక్తి లేదు. అత్యంత పిన్న వయస్సులోనే  సెల్ఫ్ మేడ్ రిచ్ లిస్ట్ బిలియనీర్‌గా నిలిచిన ఘనతను దక్కించుకున్న నితిన్‌ నెల జీతం, నెట్‌వర్త్‌కి సంబంధించిన విషయాలు సోషల్‌ మీడియాలో  చక్కర్లు కొడుతున్నాయి.  

గత కొన్ని సంవత్సరాలుగా, పారిశ్రామికవేత్తల ఆదాయం భారీగా ఎగిసింది. ​ఫలితంగా  భారత ఆర్థిక వ్యవస్థ  కూడా గణనీయంగా పుంజుకుంది. ఈ నేపథ్యంలోనే జెరోధా సీఈవో నితిన్ కామత్ నికర విలువ బాగా పెరిగింది.  2022లో  నితిన్‌ నికర విలువ  2 బిలియన్  డాలర్లు (అప్పటికి రూ. 15,612 కోట్లు)గా అంచనా వేశారు. 2021లో భారతీయ స్టార్టప్ ఎకోసిస్టమ్‌లో అత్యధిక వేతనం పొందుతున్న సహ వ్యవస్థాపకులుగా నిలిచారు.

ఎవరీ నితిన్‌ కామత్‌
నితిన్ కామత్ భారతదేశంలోని కర్ణాటకలోని శివమొగ్గలో సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. అతని తండ్రి బ్యాంకు ఉద్యోగి, అతని తల్లి గృహిణి. బెంగళూరులో ప్రాథమిక, కాలేజీ విద్యను పూర్తి చేసిన నితిన్‌ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్‌లో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పట్టభద్రుడయ్యాడు. ఈక్రమంలో 17 సంవత్సరాల వయస్సులో, తండ్రి వ్యాపారాన్ని నిర్వహించడం ప్రారంభించాడు.  అలాగే జనవరి 1997 నుండి జనవరి 2004 వరకు ప్రొప్రైటీ ట్రేడర్‌గా  పనిచేశారు.

2010లో సోదరుడు నిఖిల్‌ కామత్ సహ వ్యవస్థాపకుడిగా, భార్య సీమా పాటిల్‌తో కలిసి స్టాక్ బ్రోకరేజ్ సంస్థ 'జెరోధా'ను స్థాపించారు. కేవలం ఐదుగురు టీమ్‌తో  మొదలై 1300 మందికి పైగా ఉద్యోగులతో మల్టీ బిలియన్ల కంపెనీగా, కస్టమర్లకు సరికొత్త ఫీచర్లు,అప్‌డేట్స్‌తో జెరోధాను సంస్థను పరుగులు పెట్టించి వేల కోట్ల సంస్థగా అభివృద్ధి చేశారు.  నితిన్‌,సీమా  దంపతులకు 'కియాన్' అనే కుమారుడు ఉన్నాడు.

2021లోనే 100 కోట్ల వార్షిక వేతనం
2021లోనే  నితిన్‌,  నిఖిల్‌ ఒక్కొక్కరూ 100 కోట్ల  వార్షిక జీతం  అందుకున్నారట.  అప్పటి బోర్డు ఆమోదం ప్రకారం సీమ, నితిన్‌ ఇద్దరికీ నెలకు రూ. 4.7 కోట్ల బేస్  సాలరీ, బోనస్ , వేరియబుల్ పే ప్రయోజనాలతో ఏడాదికి  రూ. 300 కోట్లు చెల్లించే ప్రత్యేక తీర్మానాన్ని జెరోధా బోర్డు ఆమోదించిందట. దీనిపై విమర్శలు రావడంతో నితిన్ కామత్ ట్విటర్‌లో ఒక వివరణను పోస్ట్ చేశారు. వ్యాపారాన్ని ప్రారంభించడం అనేది ట్రేడింగ్‌తో సమానమని, ఏ క్షణంలోనైనా నష్టాలు రావచ్చు, లాభాలు రావచ్చు అప్రమత్తంగా ఉండాలన్నారు. తమ లాభాల్లో స్టార్టప్‌లు, ధార్మిక సంస్థలలో తమ వ్యక్తిగత పెట్టుబడులను కొనసాగించడానికి తమ పెట్టుబడుల ప్లానింగ్‌ బాగా తోడ్పడిందని చెప్పారు. అలాగే తమ టీం ఉద్యోగులకు  ఈఎస్‌ఏపీ (ఉద్యోగి స్టాక్ యాజమాన్య ప్రణాళిక) బైబ్యాక్ ద్వారా డి-రిస్కింగ్‌ను సులభతరం చేస్తున్నామని, ఈ బైబ్యాక్ కోసం ఏడాదికి దాదాపు రూ.200 కోట్లు (2021లో) కేటాయిస్తున్నామని పేర్కొన్నారు. 

పెట్టుబడిదారులకు కీలక సలహాలు
ప్రస్తుత మార్కెట్ పరిస్థితులలో పెట్టుబడి విషయానికి వస్తే, జెరోధా  ట్రూ బెకన్ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్, ఈక్విటీ మార్కెట్‌ పెట్టుబడులకంటే ఇతర పెట్టుబడులు ఇంకా మేలని  చెప్పారు.  మార్కెట్‌ టాప్‌లో ఉన్నందున,  ఈక్విటీతో పోలిస్తే  బంగారంపై పెట్టుబడి మేలని భావించారు. అలాగే ఈక్విటీ, స్థిర-ఆదాయం, రుణం, బంగారం, రియల్ ఎస్టేట్ కలయికతో కూడిన తన పోర్ట్‌ఫోలియో  వైవిధ్యతను కూడా వివరించడం విశేషం.  ఈక్విటీలో దాదాపు 40 శాతం,  అప్పులు 45 శాతం, బంగారంలో 10 శాతం, రియల్ ఎస్టేట్, ఇతరాలు  5 శాతంగా ఉన్నాయన్నారు. అయితే పన్ను ప్రయోజనాలున్న ఈక్విటీ ఎక్స్‌పోజర్‌  మంచిదని  కూడా సలహా ఇచ్చారు. 

తప్పక నివారించాల్సిన తప్పులనుకూడా కామత్ ప్రస్తావించారు. చిన్న చిన్న కుదుపులకు ఆందోళన చెందకుండా ప్రణాళికా బద్ధంగా పెట్టుబడులు పెట్టడంతెపాటు, పోర్ట్‌ఫోలియోను నిశితంగా పరిశీలించుకోవాలన్నారు. అంతేకానీ తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదని చెప్పారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వీరు సంపాదించిన దానిలో 99 శాతం తిరిగి పెట్టుబడిగా పెడతారు. అంటే కేవలం 1 శాతం లేదా అంతకంటే తక్కువ మాత్రమే  ఖర్చు చేస్తారు. బహుశా ఇదే  జెరోధా సక్సెస్‌ మంత్రా కావచ్చు. 

Advertisement
 
Advertisement