
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నెఫ్రోప్లస్ బ్రాండ్ పేరిట డయాలసిస్ సేవలందించే హైదరాబాదీ సంస్థ నెఫ్రోకేర్ హెల్త్ సరీ్వసెస్ తాజాగా పబ్లిక్ ఇష్యూకి (ఐపీవో) రానుంది. ఇందుకు సంబంధించిన ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించింది. దీని ప్రకారం ఐపీవో ద్వారా కంపెనీ రూ. 353.4 కోట్లు సమీకరించనుంది. ప్రమోటర్లు, ప్రస్తుత షేర్‌హోల్డర్లు, ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) రూపంలో 1.27 కోట్ల షేర్లను విక్రయించనున్నారు.
ప్రీ–ఐపీవో ప్లేస్‌మెంట్ ద్వారా నెఫ్రోప్లస్ రూ. 70.6 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ఇన్వెస్ట్‌కార్ప్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ టూ, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ మొదలైనవి కంపెనీ ప్రమోటర్లుగా ఉన్నాయి. ఇష్యూ ద్వారా సమీకరించిన నిధుల్లో రూ. 129.1 కోట్లను దేశీయంగా కొత్తగా డయాలసిస్ క్లినిక్‌లను ప్రారంభించేందుకు, రూ. 136 కోట్లను రుణాల చెల్లింపునకు, మిగతా మొత్తాన్ని ఇతరత్రా కార్పొరేట్ అవసరాలకు కంపెనీ వినియోగించుకోనుంది.
2009లో ఏర్పాటైన నెఫ్రోప్లస్‌కి దేశవ్యాప్తంగా 269 నగరాల్లో 447 క్లినిక్‌లు ఉన్నాయి. ఫిలిప్పీన్స్, ఉజ్బెకిస్తాన్, నేపాల్‌తో పాటు ఇటీవలే సౌదీ అరేబియా ద్వారా మధ్యప్రాచ్య మార్కెట్లోకి కూడా విస్తరించింది. 2025 మార్చి 31 నాటికి కంపెనీ వద్ద 5,000 పైగా డయాలసిస్ మెషిన్లు ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 755.8 కోట్ల ఆదాయం, రూ. 67 కోట్ల లాభం ఆర్జించింది.