ప్రభుత్వ సత్వర చర్యలతో స్టార్టప్‌లపై ప్రభావం పడలేదు | ndian startups got relief from government alert mode, SVB crisis did not affect them | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ సత్వర చర్యలతో స్టార్టప్‌లపై ప్రభావం పడలేదు

Mar 28 2023 4:15 AM | Updated on Mar 28 2023 4:15 AM

ndian startups got relief from government alert mode, SVB crisis did not affect them - Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వం సత్వరం పూనుకుని చర్యలు తీసుకోవడం వల్ల సిలికాన్‌ వేలీ బ్యాంకు (ఎస్‌వీబీ) సంక్షోభ ప్రభావాలు దేశీ స్టార్టప్‌లపై పడలేదని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ తెలిపారు. భారతీయ బ్యాంకింగ్‌ రంగాన్ని విశ్వసనీయ భాగస్వామిగా పరిగణించాలని అంకుర సంస్థలకు ఆయన సూచించారు. ఇండియా గ్లోబల్‌ ఫోరం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు చెప్పారు.

ఎస్‌వీబీ కుప్పకూలినప్పుడు.. అందులో నిధులు ఉన్న భారతీయ స్టార్టప్‌లకు సహాయం అందించేందుకు కేంద్రం వెంటనే రంగంలోకి దిగిందని ఆయన చెప్పారు. అది చిన్నపాటి సంక్షోభమైనప్పటికీ, వివిధ ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి ఏ ఒక్క అంకుర సంస్థపైనా ప్రతికూల ప్రభావం పడకుండా .. మొత్తం ప్రక్రియ సజావుగా సాగేలా కృషి చేసిందని వైష్ణవ్‌ చెప్పారు. ఒకప్పుడు టెక్నాలజీ వినియోగదారుగా మాత్రమే ఉన్న భారత్‌.. ప్రస్తుతం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ సొల్యూషన్స్‌లో ముందుకు పురోగమిస్తోందని ఆయన తెలిపారు.

ఈ నేపథ్యంలో నేడు చాలా మటుకు అంతర్జాతీయ డెవలపర్లు భారత స్టార్టప్‌లు, వ్యాపారవేత్తలు, విద్యావేత్తలను తమ భాగస్వాములుగా చేసుకోవాలనుకుంటున్నారని మంత్రి వివరించారు. భారత్‌ కూడా చాట్‌జీపీటీ లాంటివి తయారు చేయగలదా అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ‘మరికొద్ది వారాలు ఆగండి. ఒక భారీ ప్రకటన ఉండబోతోంది‘ అని ఆయన చెప్పారు. అంతర్జాతీయ ఎకానమీకి భారత్‌ వంటి విశ్వసనీయ భాగస్వామి చాలా అవసరమని వైష్ణవ్‌ పేర్కొన్నారు.  

క్వాంటమ్‌ ఆధారిత టెలికం నెట్‌వర్క్‌ ..
దేశీయంగా తొలి క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ ఆధారిత సురక్షితమైన టెలికం నెట్‌వర్క్‌ లింక్‌ ప్రస్తుతం న్యూఢిల్లీ సీజీవో కాంప్లెక్స్‌లోని సంచార్‌ భవన్, ఎన్‌ఐసీ మధ్య అందుబాటులోకి వచ్చిందని వైష్ణవ్‌ చెప్పారు. ఈ వ్యవస్థ ఎన్‌క్రిప్షన్‌ను బ్రేక్‌ చేయగలిగే ఎథికల్‌ హ్యాకర్‌లకు రూ. 10 లక్షల బహుమతి ఉంటుందని ఆయన తెలిపారు. క్వాంటమ్‌ క్రిప్టోగ్రఫీని ప్రభుత్వ రంగ పరిశోధన సంస్థ సీ–డాట్‌ రూపొందించినట్లు మంత్రి వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement