
ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ఎక్స్ఏఐ పిల్లల కోసం ప్రత్యేక ఏఐ చాట్‌బాట్ యాప్ను తీసుకురానుంది. తమ గ్రోక్ చాట్బాట్కు కిడ్-ఫ్రెండ్లీ వెర్షన్ను రూపొందించే పనిలో ఉన్నట్లు ఎలాన్ మస్క్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’(ట్విటర్) పోస్ట్ చేశారు.
'ఎక్స్ఏఐలో బేబీ గ్రోక్ అనే యాప్ను రూపొందించబోతున్నాం' అని మస్క్ తాజాగా ట్వీట్ చేశారు. పిల్లలకే ప్రత్యేకమైన కంటెంట్తో ఈ యాప్ను రూపొందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కొత్త వెర్షన్ యువ వినియోగదారుల కోసం రూపొందించిన ప్రత్యేక అప్లికేషన్ గా లాంచ్ అవుతుందని భావిస్తున్నారు, అయితే మరిన్ని వివరాలను ఇంకా ప్రకటించలేదు.
మస్క్ యాజమాన్యంలోని ఎక్స్ స్పామ్ సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి ప్లాట్ఫామ్పై కొత్త గ్రోక్ ప్రస్తావనలను తాత్కాలికంగా నిలిపివేసిన కొన్ని రోజుల తర్వాత ఈ ప్రకటన వచ్చింది. మరోవైపు వైరల్ వీడియోలను జనరేట్ చేయడానికి, దాని సృజనాత్మక సాధనాలను మరింత విస్తరించడానికి వీలు కల్పించే ‘ఇమాజిన్’ అనే కొత్త సామర్థ్యాన్ని ‘గ్రోక్’కు జోడించే పనిలో ఉన్నట్లు కూడా మస్క్ ఇటీవల వెల్లడించారు.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగం ఇటీవల విస్తృతంగా పెరిగింది. ముఖ్యంగా పిల్లల్లో ఏఐ వినియోగం క్రమంగా పెరుగుతోంది. కొన్ని నివేదికల ప్రకారం.. 44 శాతం మంది పిల్లలు జనరేటివ్ ఏఐని చురుగ్గా ఉపయోగిస్తున్నారు. ఇందులో తమ స్కూల్ వర్క్ లేదా హోమ్ వర్క్ చేయడానికే 54 శాతం వినియోగం ఉంటోంది.
We’re going to make Baby Grok @xAI, an app dedicated to kid-friendly content
— Elon Musk (@elonmusk) July 20, 2025