
ముంబై నగరంలో లగ్జరీ ఇళ్లకు (రూ.10 కోట్లు, అంతకుమించిన బడ్జెట్‌లోనివి) డిమాండ్ బలంగా పెరుగుతోంది. ఇందుకు నిదర్శనంగా ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో అమ్మకాల విలువ క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 20 శాతం పెరిగి రూ.14,751 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాల విలువ రూ.12,285 కోట్లుగా ఉండడం గమనార్హం.
సంఖ్యా పరంగా చూస్తే అల్ట్రా లగ్జరీ ఇళ్ల విక్రయాలు 11 శాతం పెరిగి 692 యూనిట్లకు చేరాయి. ఈ వివరాలను ఇండియా సోథెబిస్ ఇంటర్నేషనల్ రియల్టీ (ఐఎస్‌ఐఆర్), సీఆర్‌ఈ మ్యాట్రిక్స్ సంయుక్త నివేదిక వెల్లడించింది. కొత్తగా నిర్మించిన ఇళ్లు, మెరుగైన వసతులతో ఉన్న వాటికి కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రైమరీ మార్కెట్లో (మొదటిసారి విక్రయించే కొత్త ఇళ్లు) ఇళ్ల అమ్మకాలు 422 యూనిట్ల నుంచి 501 యూనిట్లకు పెరిగాయి. సెకండరీ మార్కెట్లో విక్రయాలు (రీసేల్) 200 యూనిట్ల నుంచి 191కు తగ్గాయి. ప్రైమరీ మార్కెట్లో అల్ట్రా లగ్జరీ ఇళ్ల అమ్మకాల విలువ రూ.8,752 కోట్ల నుంచి రూ.11,008 కోట్లకు పెరిగింది. సెకండరీ మార్కెట్లో అమ్మకాల విలువ రూ.3,533 కోట్ల నుంచి రూ.3,743 కోట్లకు చేరింది.
ఇదీ చదవండి: చందా కొచ్చర్‌పై ఆరోపణలు.. నిజం బట్టబయలు
‘ముంబై లగ్జరీ ఇళ్ల మార్కెట్ కీలక తరుణంలో ఉంది. ఈ ఏడాది మొదటి అర్ధ భాగంలో రికార్డు స్థాయి అమ్మకాలు అల్ట్రా ప్రీమియం ఇళ్లకు ఉన్న డిమాండ్‌ను తెలియజేస్తోంది. ముఖ్యంగా వర్లి, ప్రభాదేవి, మలబార్ హిల్, బాంద్రా వెస్ట్ వంటి సూక్ష్మ మార్కెట్లలో డిమాండ్ ఎక్కువగా ఉంది’ అని ఐఎస్‌ఐఆర్ ఈడీ సుదర్శన్ శర్మ తెలిపారు.