సంపన్నులు... తగ్గేదేలే!

Mumbai Has Highest Ultra-Wealthy Population In The Country: Knight Frank Wealth Report - Sakshi

అల్ట్రా హెచ్‌ఎన్‌ఐల సంఖ్య 13,367 

2021లో 11 శాతం పెరుగుదల 

వచ్చే ఐదేళ్లలో 28 శాతం వృద్ధి 

నైట్‌ ఫ్రాంక్‌ నివేదిక విడుదల 

న్యూఢిల్లీ: దేశంలో అల్ట్రా హెచ్‌ఎన్‌ఐ (అధిక విలువ కలిగిన వ్యక్తులు)ల సంఖ్య 2021లో 11 శాతం పెరిగి 13,637కు చేరుకుంది. 30 మిలియన్‌ డాలర్లు (రూ.225 కోట్లు) అంతకంటే ఎక్కువ కలిగిన వారిని అల్ట్రా హెచ్‌ఎన్‌ఐలుగా పరిగణిస్తారు. గడిచిన ఏడాది ఈక్విటీ మార్కెట్లు ర్యాలీ చేయడం, డిజిటల్‌ విప్లవం హెచ్‌ఎన్‌ఐల వృద్ధికి తోడ్పడినట్టు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ తన తాజా నివేదికలో తెలిపింది. 2021లో బిలియనీర్ల సంఖ్యా పరంగా భారత్‌ మూడో స్థానంలోఉన్నట్టు పేర్కొంది. 748 బిలియనీర్లతో అమెరికా మొదటి స్థానంలో ఉంటే, 554 మంది బిలియనీర్లతో చైనా రెండో స్థానంలో ఉంది. భారత్‌లో 145 మంది బిలియనీర్లు ఉన్నారు. ‘ద వెల్త్‌ రిపోర్ట్‌ 2022’ను నైట్‌ ఫ్రాంక్‌ మంగళవారం విడుదల చేసింది.  

► 2021లో అల్ట్రా హెచ్‌ఎన్‌ఐల సంఖ్య అంతర్జాతీయంగా 9.3 శాతం పెరిగి 6,10,569కు చేరింది. అంతకుముందు సంవత్సరంలో వీరి సంఖ్య 5,58,828.  
► భారత్‌లో అల్ట్రా హెచ్‌ఎన్‌ఐల సంఖ్య 2020 చివరికి 12,287గా ఉంటే, 2021 చివరికి 13,637కు పెరిగింది. ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో భారత్‌లోనే వృద్ధి ఎక్కువగా నమోదైంది.  
►  బెంగళూరు నగరంలో వీరి సంఖ్య పెరుగుదల ఎక్కువగా ఉంది. గతేడాది ఈ నగరంలో అల్ట్రా హెచ్‌ఎన్‌ఐల సంఖ్య 17 శాతం వృద్ధి చెంది 352గా ఉంది.  
►  ఆ తర్వాత ఢిల్లీలో 12.4 శాతం పెరిగి 210కి, ముంబైలో 9 శాతం పెరిగి 1,596కు అల్ట్రా హెచ్‌ఎన్‌ఐల సంఖ్య చేరింది. 
►  దేశంలోని సంపన్నుల్లో 69 శాతం మంది సంపద 2022లో 10 శాతం పెరుగుతుందని నైట్‌ ఫ్రాంక్‌ అంచనా. 
►   ఆసియా బిలియనీర్ల క్లబ్‌గా ఉంది. ప్రపంచవ్యాప్తంగా 2021 నాటికి ఉన్న బిలియనీర్లలో 36 శాతం మంది ఆసియాలోనే ఉన్నారు. 
►  అంతర్జాతీయంగా 1,35,192 అల్ట్రా హెచ్‌ఎన్‌ఐలు తాము సొంతంగా సంపాదించి ఈ స్థితికి చేరినవారు. వీరిలో 40 ఏళ్లలోపు వారు 20 శాతంగా ఉన్నారు. 
►  ఇలా స్వయంగా పైకి ఎదిగిన అల్ట్రా హెచ్‌ఎన్‌ఐల వృద్ధి విషయంలో భారత్‌ ప్రపంచంలో ఆరో స్థానంలో ఉంది.   
►  వచ్చే ఐదేళ్లలో అంతర్జాతీయంగా హెచ్‌ఎన్‌ఐల సంఖ్య 28 శాతం పెరుగుతుందని అంచనా. అలాగే భారత్‌లో 2021–2026 మధ్య అల్ట్రా హెచ్‌ఎన్‌ఐల సంఖ్య 39 శాతం పెరిగి 19,006కు చేరుకోవచ్చు.  

ఆభరణాలు, క్లాసిక్‌ కార్లు, కళాఖండాలు 
అల్ట్రా హెచ్‌ఎన్‌ఐలు తమ పెట్టుబడుల్లో 11 శాతాన్ని లగ్జరీ వస్తువులకు కేటాయిస్తున్నారు. క్లాసిక్‌ కార్లు, ఆభరణాలు, పెయింటింగ్‌లు, కళాఖండాలు, వాచీలు, హ్యాండ్‌బ్యాగుల కొనుగోలుకు మొగ్గు చూపిస్తున్నారు. అంతర్జాతీయంగా చూస్తే అల్ట్రా హెచ్‌ఎన్‌ఐలు వీటి కోసం తమ పెట్టుబడుల్లో 16 శాతం కేటాయిస్తున్నట్టు నైట్‌ ఫ్రాంక్‌ నివేదిక తెలియజేసింది. అల్ట్రా హెచ్‌ఎన్‌ఐల్లో 29 శాతం మంది 2021లో ఈ తరహా ప్యాషన్‌ పెట్టుబడులపై ఎక్కువ వెచ్చించారు. ప్యాషన్‌ పెట్టుబడులన్నవి.. రాబడుల కంటే కూడా వాటిల్లో వాటా ఉందన్న ఆనందాన్నిచ్చేవి. వీటిల్లోనూ కళాఖండాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటే, ఆభరణాలు, క్లాసిక్‌ కార్లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. లగ్జరీ హ్యాండ్‌బ్యాగులు, వైన్‌ గతంలో మొదటి స్థానంలో ఉంటే, అవి ఇప్పుడు 5, 7వ స్థానాలకు వెళ్లాయి. కళాత్మక ఉత్పత్తులు 2021లో 13 శాతం రాబడులను ఇవ్వగా, గత పదేళ్లలో 75 శాతం రాబడిని ఇచ్చాయి. వైన్‌ 16 శాతం, అరుదైన విస్కీ బ్రాండ్లపై పెట్టుబడి 9 శాతం వృద్ధి చెందింది. 

ప్రాపర్టీలపై 29 శాతం  
అల్ట్రా హెచ్‌ఎన్‌ఐలు గతేడాది తమ సంపదలో 29 శాతాన్ని ప్రాథమిక, ద్వితీయ ఇళ్ల కోసం కేటాయించారు. వీరు పెట్టుబడుల మొత్తంలో 22 శాతాన్ని వాణిజ్య ఆస్తులు (కార్యాలయం, వాణిజ్య భవనం) కొనుగోలుకు వెచ్చించారు. 8% సంపదను రీట్‌ తదితర సాధనాల్లో పెట్టుబడులకు వినియోగించారు. ఇక భారత అల్ట్రా హెచ్‌ఎన్‌ఐ ప్రాపర్టీల్లో 8% విదేశాల్లో ఉన్నాయి. 10% మంది  ఈ ఏడాది ఇల్లు కొనుగోలు ప్రణాళికతో ఉన్నారు. మన దేశం తర్వాత బ్రిటన్, యూఏఈ, అమెరికాల్లో ప్రాపర్టీల కొనుగోళ్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. 

క్రిప్టోల్లోనూ పెట్టుబడులు 
భారత్‌లోని అల్ట్రా హెచ్‌ఎన్‌ఐల్లో 18 శాతం మందికి క్రిప్టోల్లో పెట్టుబడులు ఉన్నాయి. వీరిలో 10 శాతం మంది క్రిప్టోకరెన్సీలు, క్రిప్టో టోకెన్లలో పెట్టుబడులు పెడితే, 8 శాతం మంది ఎన్‌ఎఫ్‌టీలను కొనుగోలు చేశారు. అంతర్జాతీయంగా చూస్తే 18 శాతం అల్ట్రా హెచ్‌ఎన్‌ఐలు క్రిప్టో పెట్టుబడులు కలిగి ఉన్నారు. వీరిలో 11 శాతం మంది నాన్‌ ఫంజిబుల్‌ టోకెన్లలో (ఎన్‌ఎఫ్‌టీలు) ఇన్వెస్ట్‌ చేశారు.    

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top