డిసెంబర్‌ 20న మొబైల్‌ ఫోన్లు స్విచ్‌ఆఫ్‌.. ఎందుకంటే..

Mobiles Do SwitchOff On December 20 - Sakshi

అన్నం తినకుండా మారాం చేస్తున్నారనో.. అల్లరి ఆపడం కోసమో చాలా మంది తల్లిదండ్రులు పిల్లల చేతికి ఫోన్ ఇస్తుంటారు. తొలుత సరదాగా ప్రారంభమైనప్పటికీ.. క్రమేపీ వారికి అదో వ్యసనంగా మారుతోంది. దీంతో.. రోజులో ఫోన్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారని కొన్ని నివేదికలు చెబుతున్నాయి.

తాజాగా స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీ వివో ‘స్విచాఫ్​’ పేరుతో ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ నెల 20న తమ కస్టమర్లు అందరూ వారి స్మార్ట్‌‌‌‌ఫోన్‌‌‌‌లను స్విచ్ ఆఫ్ చేయాలని కోరింది. డిసెంబర్‌ 20న రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు తమ  కుటుంబాలతో సరదాగా గడపాలని, పిల్లలు వారి తల్లిదండ్రులతో సంతోషంగా ఉండాలని ప్రజలను కోరింది. కంపెనీ చేసిన ఓ సర్వేలో.. 77 శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలు విపరీతంగా స్మార్ట్ ఫోన్ వాడుతున్నారని ఫిర్యాదు చేసినట్లు వివో తెలిపింది. తల్లిదండ్రులకు సైతం ఫోన్​ వ్యసనంగా మారిందని పేర్కొంది. ఈ క్రమంలో తల్లిదండ్రులు, పిల్లలకు మధ్య అంతరాలు ఏర్పడితే భవిష్యత్తులో సమాజానికి నష్టం కలుగుతుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.

కొన్ని సర్వేల ప్రకారం.. 42 శాతం మంది 12 ఏళ్ల లోపు వయసు పిల్లలు రోజులో రెండు నుంచి నాలుగు గంటలపాటు ఫోన్‌ స్క్రీన్లకు అతుక్కుపోతున్నారు. 12 ఏళ్ల కంటే పైబడిన పిల్లలు రోజులో 47 శాతం సమయం ఫోన్ చూస్తున్నారు. 69 శాతం పిల్లలకు సొంత ఫోన్‌లు, ట్యాబ్‌లు ఉన్నాయట. 12 ఏళ్లు, అంతకంటే పెద్ద వయసు పిల్లలకు ఎలాంటి షరతులు లేకుండా ఇంటర్నెట్‌ యాక్సెస్‌ పొందుతున్నారని సర్వేల్లో వెల్లడైంది. 74 శాతం మంది పిల్లలు యూట్యూబ్‌ చూసేందుకు ఫోన్‌ వాడుతుంటే, 12 ఏళ్ల పైబడినవారు గేమింగ్‌ కోసం ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని తేలింది.

ఇదీ చదవండి: ‘కంపెనీని టేకోవర్‌ చేసే ప్రతిపాదన లేదు’

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top