
కృత్రిమ మేధ (ఏఐ) సాధనాలను అందుబాటులోకి తీసుకురావడంలో టెక్ దిగ్గజాల మధ్య పోటీ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌ల యాజమాన్య సంస్థ మెటా తన ఏఐ సాధనానికి ఎట్టకేలకు మొబైల్ యాప్‌ను తీసుకొచ్చింది. టెక్స్ట్ సంభాషణలు, వాయిస్ చాట్స్, ఇమేజ్ ఎడిటింగ్ వంటి ఫీచర్లను అందించే అధునాతన లామా 4 మోడల్‌తో నడిచే ఈ యాప్ ఆండ్రాయిడ్, యాపిల్ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది.
ప్రత్యేక ఫీచర్
మెటా ఏఐ యాప్ ఒక ప్రత్యేకమైన డిస్కవర్ ఫీడ్‌ను పరిచయం చేసింది. అదే ఏఐతో యూజర్ల ఇంటరాక్షన్‌ను ప్రదర్శించే సోషల్ మీడియా-ప్రేరేపిత ఇంటర్‌ఫేస్. ఇది ఏఐ యాప్ ల్యాండ్ స్కేప్‌లో మొదటిది. సృజనాత్మక కంటెంట్‌ను సృష్టించడం నుండి సంక్లిష్టమైన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం, కమ్యూనిటీ-ఆధారిత అనుభవాన్ని పెంపొందించడం వరకు ఇతరులు మెటా ఏఐని ఎలా ఉపయోగిస్తున్నారో ఈ ఫీచర్ ద్వారా తెలుసుకోవచ్చు. కేవలం టెక్ట్స్ మాత్రమే కాకుండా ఇమేజ్‌లను సైతం సృజనాత్మకంగా ఇందులో సృష్టించవచ్చు.
వాయిస్ చాట్ కోసం ఎదురుచూపులే..
ఈ యాప్ ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అయినప్పటికీ బాగా ప్రాచుర్యం పొందిన వాయిస్ చాట్ ఫీచర్ మాత్రం భారత్‌లోని యూజర్లకు అందుబాటులో లేదు. ఇది ప్రస్తుతం ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్ యునైటెడ్ స్టేట్స్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. భారత్‌తోపాటు యూఏఈ, మెక్సికో వంటి ఇతర ఈ మార్కెట్లకు వాయిస్ చాట్ ఫీచర్ ఎప్పుడు అందుబాటులోకి తెచ్చేది కంపెనీ వెల్లడించలేదు.
భారత్ త్వరలో రే-బాన్ మెటా గ్లాసెస్‌ను పరిచయం చేస్తున్న క్రమంలో మెటా ఈ యాప్‌ను లాంచ్ చేసినట్లు తెలుస్తోంది. మెటా ఏఐ యాప్‌తో అనుసంధానించే ఈ స్మార్ట్ గ్లాసెస్, నావిగేషన్ నుండి రియల్ టైమ్ అనువాదాల వరకు వినియోగదారుల దైనందిన జీవితంలో ఆగ్మెంటెడ్ రియాలిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయాన్ని అందిస్తాయి.
వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏఐ మార్కెట్లో మెటా ఏఐ యాప్‌ను పోటీ చర్యగా పరిశ్రమ విశ్లేషకులు భావిస్తున్నారు.