చిప్‌ల కొరతతో వాహన డిమాండ్‌కు భారీ దెబ్బ!

Maruti: Long wait period due to chip shortage can negatively impact demand - Sakshi

మారుతీ సుజుకీ సీనియర్‌ ఈడీ శశాంక్‌ శ్రీవాస్తవ

న్యూఢిల్లీ: సెమీకండక్టర్లు (చిప్‌) సరఫరాలో తీవ్ర జాప్యం వల్ల ఉత్పాదన దెబ్బతింటోందని కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శశాంక్‌ శ్రీవాస్తవ తెలిపారు. దీనివల్ల కార్ల డిమాండ్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ప్రస్తుతానికైతే మార్కెట్లో డిమాండ్‌ బాగానే ఉందని, బుకింగ్‌లు కూడా మెరుగ్గానే ఉన్నాయని శ్రీవాస్తవ పేర్కొన్నారు. అయితే, కార్ల లభ్యత సమస్యగా మారిందని, వెయిటింగ్‌ పీరియడ్‌ గణనీయంగా పెరిగిపోయిందని వివరించారు.  

‘ఇలా సుదీర్ఘ సమయం పాటు వేచి ఉండాల్సి రావడం వల్ల డిమాండ్‌ ధోరణులపై ప్రతికూల ప్రభావాలు పడవచ్చేమో అన్న ఆందోళన నెలకొంది‘ అని శ్రీవాస్తవ పేర్కొన్నారు. అయితే, తాము ఎప్పటికప్పుడు కస్టమర్లతో మాట్లాడుతూనే ఉన్నందువల్ల బుకింగ్‌లేమీ రద్దు కావడం లేదని ఆయన చెప్పారు. ‘పరిస్థితి ఏమిటి, ఎప్పట్లోగా వాహనం అందుకోవచ్చు వంటి విషయాల గురించి ప్రతీ వారం దాదాపు ప్రతీ కస్టమర్‌ను సంప్రదించి, వివరిస్తున్నాం. చాలా మటుకు కస్టమర్లు అర్థం కూడా చేసుకుంటున్నారు‘ అని శ్రీవాస్తవ తెలిపారు. మోడల్, వేరియంట్‌ను బట్టి వెయిటింగ్‌ పీరియడ్‌ అనేది కొద్ది వారాలు మొదలుకుని నెలల దాకా ఉంటోంది. ప్రస్తుతం సెమీకండక్టర్ల సరఫరా కాస్త మెరుగుపడుతోందని శ్రీవాస్తవ వివరించారు. మారుతీకి ప్రస్తుతం 2.5 లక్షల యూనిట్ల ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నాయి. నవంబర్‌లో కంపెనీ ప్లాంట్లు .. ఉత్పత్తి సామర్థ్యాల్లో దాదాపు 80 శాతం మేర పనిచేశాయి. 

(చదవండి: 900 మంది ఉద్యోగుల తొలగింపుపై హర్ష్ గోయెంకా కీలక వ్యాఖ్యలు!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top