ఫెడ్‌ నిర్ణయాలు కీలకం | Sakshi
Sakshi News home page

ఫెడ్‌ నిర్ణయాలు కీలకం

Published Mon, Mar 18 2024 8:36 AM

Markets to remain volatile amid US Fed rate decision speculations - Sakshi

ముంబై: అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ ద్రవ్య పరపతి నిర్ణయాలు, ప్రపంచ పరిణామాలు ఈ వారం స్టాక్‌ మార్కెట్‌ దిశానిర్దేశం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఆయా దేశాల స్థూల ఆర్థిక గణాంకాలు, విదేశీ ఇన్వెస్టర్ల వైఖరి అంశాలు ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపొచ్చు. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల తేదీ ప్రకటన తర్వాత ఇన్వెస్టర్లు సార్వత్రిక ఎన్నికల పరిణామాలను క్షుణ్ణంగా పరిశీలింవచ్చు. వీటితో పాటు రూపాయి విలువ, క్రూడాయిల్‌ కదలికలపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చని స్టాక్‌ నిపుణులు చెబుతున్నారు.   

‘‘స్మాల్, మిడ్‌ క్యాప్‌ ఫండ్ల నిర్వహణ సామర్థ్యాలను పరీక్షించేందుకు స్ట్రెస్‌ టెస్ట్‌ నిర్వహించాలని సెబీ ఆదేశాలు జారీ నేపథ్యంలో ఇన్వెస్టర్లు లార్జ్‌ క్యాప్, రక్షణాత్మక షేర్ల పట్ల ఆసక్తి చూపొచ్చు. సాంకేతికంగా నిఫ్టీ బలహీనంగా ఉంది. నిర్ణయాత్మక తక్షణ మద్దతు 21,850 స్థాయిని కోల్పోతే దిగువ స్థాయిలో 21,450 స్థాయిని పరీక్షించవచ్చు’’ అని మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్సియల్‌ సరీ్వసెస్‌ రిటైల్‌ హెడ్‌ సిద్ధార్థ ఖేమా తెలిపారు. ఇంధన, రియలీ్ట, ఫైనాన్స్‌ రంగాలకు చెందిన చిన్న, మధ్య స్థాయిలకు షేర్లలో భారీ ఎత్తున అమ్మకాలు జరగడంతో సూచీలు గతవారంలో 2% మేర నష్టపోయాయి. వారం మొత్తంగా సెన్సెక్స్‌ 1476 పాయింట్లు, నిఫ్టీ 470 పాయింట్లు పతనమయ్యాయి. బీఎస్‌ఈ స్మాల్‌ క్యాప్‌ సూచీ 2,641 పాయింట్లు, మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 1602 పాయింట్లు చొప్పున క్షీణించాయి.  

ఫెడ్‌ వడ్డీ రేట్ల నిర్ణయ ప్రభావం 
అగ్ర రాజ్యం అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌ యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ సమావేశం మంగళవారం(మార్చి 19న) ప్రారంభమవుతుంది. ఫెడరల్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ తీసుకున్న నిర్ణయాలను ఫెడ్‌ చైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ బుధవారం(20న)రోజున ప్రకటిస్తారు. ఫిబ్రవరి అమెరికా కన్జూమర్‌ ఇండెక్స్, ద్రవ్యోల్బణం అంచనాలకు మించి నమోదుకావడంతో ఫెడ్‌ రిజర్వ్‌ కీలక వడ్డీరేట్ల(5.25 – 5.5%) యథాతథంగా ఉంచొచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. అయితే బాండ్ల కొనుగోలు, ఆర్థిక వ్యవస్థ పనితీరుపై పావెల్‌ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారోనని ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు ఆసక్తి ఎదురుచూస్తున్నాయి. ఫెడ్‌ రిజర్వ్‌ ద్రవ్య విధాన వైఖరికి ముందు కొందరు ట్రేడర్లు తమ పొజిషన్లను వెనక్కి తీసుకోవచ్చు.  

ప్రపంచ పరిణామాలు 
అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ తో పాటు బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌(మార్చి 19), బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌(మార్చి 21) ద్రవ్య విధానాలు వెల్లడి కానున్నాయి. అలాగే చైనా ఐదేళ్ల రుణ పరపతి రేటు ప్రకటించనుంది. దీంతో ఈక్విటీ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవచ్చు. బ్రిటన్‌ ప్రొడక్టర్‌ ప్రైస్‌ ఇండెక్స్, తయారీ, సేవారంగ పీఎంఐ గణాంకాలు వెల్లడి కానున్నాయి. యూరోజోన్‌ ద్రవ్యోల్బణం, వాణిజ్య లోటు, చైనా రిటైల్‌ సేల్స్, నిరుద్యోగ డేటాలు ఇదే వారంలో వెల్లడి కానున్నాయి.  

మార్చి ప్రథమార్థంలో రూ.40 వేల కోట్ల పెట్టుబడులు  
విదేశీ ఇన్వెస్టర్లు ఈ మార్చి ప్రథమార్థంలో రూ.40,710 కోట్ల భారత ఈక్విటీలు కొన్నారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడటం, దేశీయ స్థూల ఆర్థిక వృద్ధి సానుకూల అంచనాలు ఇందుకు ప్రధాన కారణాలని మార్కెట్‌ నిపుణులు తెలిపారు. అమెరికా బాండ్లపై రాబడులకు అనుగుణంగా విదేశీ ఇన్వెస్టర్లు తమ వ్యూహాన్ని మార్చుకుంటున్నారు. తాజాగా ద్రవ్యోల్బణ పెరగడంతో బాండ్లపై రాబడులు స్వల్పంగా పెరుగుతున్నాయి. దీంతో విదేశీ ఇన్వెస్టర్లు మళ్లీ నికర విక్రయదారులుగా మారే అవకాశం ఉంది.
 

Advertisement
 
Advertisement
 
Advertisement