
దేశీ ఆటోమొబైల్ దిగ్గజం మహింద్రా తన సూపర్ హిట్ బొలెరో ఎస్‌యూవీలో కొత్త వేరియంట్లను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. బొలెరో B8, బొలెరో నియో N11 అని పిలుస్తున్న ఈ కొత్త వేరియంట్ల ధరలు రూ.7.99 లక్షల నుంచి రూ.9.99 లక్షల (ఎక్స్ షో రూమ్) వరకూ ఉండనున్నాయి.
డిజైన్ పరంగా చూస్తే కొత్త బొలెరోలో ఆకట్టుకునే హారిజోంటల్ యాక్సెంట్స్‌తో ఆకర్షణీయమైన డిజైన్‌ను సరికొత్తగా సిద్ధం ఏశారు. ఫాగ్‌ల్యాంప్స్‌తోపాటు డైమండ్ కట్ ఆర్-15 అలాయ్ వీల్స్‌ను అందిస్తున్నారు. మూడు రంగుల్లో, డ్యుయల్‌టోన్, స్టెల్త్ బ్లాక్ రంగు ఆప్షన్స్‌తో అందుబాటులో ఉన్న ఈ వాహనాలల్లో ప్రయాణీకుల సౌకర్యాలకు పెద్దపీట వేశారు.
సరికొత్త 17.8 సెం.మీ. టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, స్టీరింగ్‌పైనే ఆడియో నియంత్రణకు అవసరమైన బటన్లు ఉన్నాయి. అలాగే వాహనాన్ని నడపడంలో సౌలభ్యం కోసం రైడ్ &హ్యాండ్లింగ్ టెక్నాలజీ టెక్‌ను వాడారు. ఎలాంటి నేలపైనైనా వెళ్లేందుకు ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది.
ఈ ఎస్‌యూవీల్లో 55.9 kW శక్తి మరియు 210 Nm టార్క్‌ను అందించే mHAWK75 ఇంజిన్‌ను ఉపయోగించారు. బాడీ-ఆన్-ఫ్రేమ్ నిర్మాణ స్వరూపంతో పటిష్టంగా ఉంటుంది. పగుళ్లిచ్చిన రహదారులపై కూడా మెరుగైన ట్రాక్షన్ లభించేలా బొలెరో నియోలో క్రూయిజ్ కంట్రోల్ మరియు మల్టీ-టెరైన్ టెక్నాలజీ (ఎంటీటీ) ఉన్నాయి.
ఇంటీరియర్స్ విషయానికి వస్తే లూనార్ గ్రే, మోకా బ్రౌన్ థీమ్ ఆప్షన్లు ఉన్నాయి. లెదరెట్ అప్‌హోల్‌స్ట్రీతోపాటు రియర్ వ్యూ కెమెరా, 22.8 సెంటీమీటర్ల టచ్ స్క్రీన్ ఇన్ఫోటెయిన్ మెంట్ ఏర్పాట్లు ఉన్నాయి.
కొత్త బొలెరో ధర రూ. 7.99 లక్షల (ఎక్స్-షోరూం) నుంచి ప్రారంభం అవుతుండగా, కొత్తగా ప్రవేశపెట్టిన టాప్ ఎండ్ B8 వేరియంట్ ధర రూ. 9.69 లక్షలుగా (ఎక్స్-షోరూం) ఉంటుంది. కొత్త బొలెరో నియో ధర రూ. 8.49 లక్షల నుంచి (ఎక్స్-షోరూం) ప్రారంభమవుతుంది. కొత్త టాప్-ఎండ్ వేరియంట్ N11 రేటు రూ. 9.99 లక్షలు.
మహీంద్రా అండ్ మహీంద్రా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఆటోమోటివ్ డివిజన్) నళినికాంత్ గొల్లగుంట మాట్లాడుతూ “పాతికేళ్లుగా భారతదేశపు అత్యంత విశిష్టమైన, పటిష్టమైన ఎస్‌యూవీగా సుస్థిర స్థానం సంపాదించుకున్న బొలెరో నవ భారత యువత ఆకాంక్షలకు అనుగుణంగా సరికొత్త శ్రేణి తీర్చిదిద్దింది. దృఢత్వం, సమకాలీన స్టైలింగ్, మరింత సౌకర్యం, ఆధునిక ఫీచర్ల మేళవింపుతో సరికొత్త బొలెరో, బొలెరో నియో, పట్టణ ప్రాంతాల్లోనూ అటు సంక్లిష్టమైన ఎత్తుపల్లాల్లోనూ సమంగా, అత్యంత శక్తివంతమైన ఎస్‌యూవీ అనుభూతిని అందిస్తాయి” అని తెలిపారు.
ఇదీ చదవండి: 6జీ అభివృద్ధిలో భారత్ పాత్ర కీలకం