ఎల్‌ఐసీ కొత్త పాలసీలు.. | LIC Launches 2 New Insurance Plans Nav Jeevan Shree and Nav Jeevan Shree Single Premium | Sakshi
Sakshi News home page

LIC Nav Jeevan Shree: ఎల్‌ఐసీ కొత్త పాలసీలు..

Jul 4 2025 9:55 PM | Updated on Jul 4 2025 9:59 PM

LIC Launches 2 New Insurance Plans Nav Jeevan Shree and Nav Jeevan Shree Single Premium

ప్రభుత్వ రంగానికి చెందిన ప్రముఖ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) తాజాగా నవ జీవన్ శ్రీ, నవ జీవన్ శ్రీ - సింగిల్ ప్రీమియం పేరుతో రెండు కొత్త  సేవింగ్‌ పాలసీలను ప్రారంభించింది. ఇవి నాన్ పార్టిసిపేటింగ్, నాన్ లింక్డ్, లైఫ్ కవరేజ్ కలిగిన వ్యక్తిగత సేవింగ్ ప్లాన్లు. బీమా రక్షణతో పాటు పెట్టుబడికి భద్రత, వడ్డీ రాబడి కోరుకునేవారికి ఇవి అనువుగా ఉంటాయి. ఈ పాలసీలు 2025 జూలై 4 నుంచి 2026 మార్చి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయని ఎల్‌ఐసీ తెలిపింది. 
  
నవ జీవన్ శ్రీ - రెగ్యులర్ ప్రీమియం (ప్లాన్ నెం.912) 
ఇది ఒకేసారి కాకుండా విడతల వారీగా ప్రీమియం చెల్లించే వారికి అనువైన ప్లాన్. కనీస సమ్ అష్యూర్డ్ రూ.5 లక్షలు, గరిష్ఠ పరిమితి లేదు. వయస్సు పరిమితి 30 రోజుల నుంచి 75 ఏళ్ల వరకు. మెచ్యూరిటీ నాటికి కనిష్ట వయసు 18 సంవత్సరాలు కాగా గరిష్ట వయసు 75 ఏళ్లు. 6, 8, 10 లేదా 12 సంవత్సరాల  ప్రీమియం చెల్లింపు వ్యవధులను ఎంచుకోవచ్చు. పాలసీ టర్మ్ కనీసం 10 సంవత్సరాలు. 15, 16, 20 ఏళ్ల వ్యవధిని కూడా ఎంచుకోవచ్చు.
       
గ్యారెంటీడ్ అడిషన్లు: 10-13 ఏళ్ల పాలసీకి - 8.50 శాతం, 14-17 సంవత్సరాలకు 9 శాతం, 18-20 ఏళ్ల  కాలానికి 9.50 శాతం చొప్పున గ్యారెంటీడ్ అడిషన్లు లభిస్తాయి.

డెత్ బెనిఫిట్‌: ఆప్షన్ 1 కింద - కనీస సమ్ అష్యూర్డ్‌తోపాటు వార్షిక ప్రీమియానికి 7 రెట్లు, ఆప్షన్ 2 కింద - వార్షిక ప్రీమియానికి 10 రెట్లు + బేసిక్ సమ్ అష్యూర్డ్ చెల్లిస్తారు.
దీనికి కూడా యాక్సిడెంట్ డెత్ & డిజేబిలిటీ బెనిఫిట్ రైడర్, యాక్సిడెంట్ బెనిఫిట్ రైడర్, న్యూ టర్మ్ అష్యూరెన్స్ రైడర్, ప్రీమియం వెయివర్ బెనిఫిట్ రైడర్ వంటి వాటిని జోడించుకునే వెసులుబాటు ఉంది.
       
మెచ్యూరిటీ తర్వాత లేదా రిస్క్‌ జరిగినప్పుడు చెల్లింపు: మొత్తం డబ్బును ఒకేసారి లేదా నెలవారీ/త్రైమాసిక/అర్ధవార్షిక/వార్షిక ప్రాతిపదికన పొందవచ్చు. ప్రీమియం చెల్లింపును కూడా ఇదే విధంగా ఎంపిక చేసుకోవచ్చు.

నెలకు రూ.10 వేలతో రూ.26 లక్షలు
ఒక వ్యక్తి రూ.10 లక్షల సమ్ అష్యూర్డ్‌తో 20 ఏళ్ల కాలానికి పాలసీ తీసుకుంటే.. ఆప్షన్ 2 కింద 10 సంవత్సరాల ప్రీమియం చెల్లింపు వ్యవధిని ఎంచుకుంటే వార్షిక ప్రీమియం రూ.1,10,900 కట్టాలి. అదే నెలవారీ అయితే రూ.10,000 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఇలా పదేళ్లకూ చెల్లించే మొత్తం సొమ్ము: రూ.11,09,000 అవుతుంది. పాలసీ వ్యవధి 20 సంవత్సరాలు పూర్తయ్యాక రూ.16,58,786 గ్యారెంటీడ్ అడిషన్ రూపంలో లభిస్తాయి. మొత్తం కలుపుకొంటే మెచ్యూరిటీ తర్వాత రూ.26,58,786 లభిస్తుంది.

నవ జీవన్‌ శ్రీ- సింగిల్‌ ప్రీమియం (ప్లాన్‌ నం.911) 
ఈ పాలసీ ఒకేసారి ఏకమొత్తం పెట్టుబడి పెట్టదలచుకున్న వారికి అనువుగా ఉంటుంది. ఈ పాలసీని 30 రోజుల నుండి 60 ఏళ్ల వయస్సు వరకూ ఎవరైనా తీసుకోవచ్చు. అయితే ఆప్షన్ 2 కింద మాత్రం గరిష్ఠ వయస్సు 40 ఏళ్లు మాత్రమే. మెచ్యూరిటీ సమయానికి కనీస వయస్సు 18 ఏళ్లు, గరిష్ఠంగా 75 ఏళ్లు (ఆప్షన్ 2లో 60) ఉండాలి. పాలసీ వ్యవధి కనీసం 5 సంవత్సరాలు, గరిష్ఠంగా 20 సంవత్సరాలు.  కనీస హామీ మొత్తం (Sum Assured) రూ.1 లక్ష. గరిష్ఠ పరిమితి లేదు.
       
డెత్ బెనిఫిట్‌: ఆప్షన్ 1 కింద - సింగిల్ ప్రీమియానికి 1.25 లేదా బేసిక్ సమ్ అష్యూర్డ్‌లో  ఏది ఎక్కువైతే ఆ మొత్తాన్ని చెల్లిస్తారు. ఆప్షన్ 2 కింద - సింగిల్ ప్రీమియానికి 10 రెట్లు రిస్క్ కవరేజీ లభిస్తుంది.

గ్యారెంటీడ్ అడిషన్:  ప్రతి వెయ్యి రూపాయల బేసిక్ సమ్ అష్యూర్డ్‌పై రూ.85 చొప్పున గ్యారెంటీడ్ అడిషన్ లభిస్తుంది. యాక్సిడెంట్ డెత్ & డిజేబిలిటీ రైడర్, న్యూ టర్మ్ అష్యూరెన్స్ రైడర్ వంటి అదనపు రైడర్లను కూడా జోడించుకోవచ్చు.

రిస్క్ లేదా మెచ్యూరిటీ సమయంలో చెల్లింపు: మొత్తాన్ని ఒకేసారి లేదా నెలవారీ, త్రైమాసిక, అర్ధవార్షిక లేదా వార్షిక పద్ధతిలో పొందే అవకాశముంది.
       
రూ.5 లక్షలకు రూ.7.12 లక్షలు
18 ఏళ్ల వ్యక్తి ఐదేళ్ల వ్యవధికి రూ.5 లక్షల సమ్ అష్యూర్డ్‌తో పాలసీ తీసుకుంటే..  సింగిల్ ప్రీమియం రూ.5,39,325 చెల్లించాలి. దీనికి ప్రతి ఏడాది గ్యారెంటీడ్ అడిషన్‌గా రూ.42,500 వస్తుంది.(మొత్తం రూ.2,12,500). ఐదేళ్ల తర్వాత మెచ్యూరిటీ సమయంలో మొత్తంగా రూ.7,12,500 లభిస్తుంది. ఒకవేళ చివరి సంవత్సరంలో రిస్క్ జరిగితే గరిష్టంగా  రూ.9.17 లక్షలు ఎల్‌ఐసీ నుంచి లభిస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement