కొటక్‌ మహీంద్రా క్యూ3 గుడ్‌ | Sakshi
Sakshi News home page

కొటక్‌ మహీంద్రా క్యూ3 గుడ్‌

Published Mon, Jan 22 2024 6:18 AM

Kotak Mahindra Bank Q3 PAT up 8percent to Rs 3005 crore - Sakshi

ముంబై: ప్రయివేట్‌ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం కొటక్‌ మహీంద్రా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) మూడో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ3)లో నికర లాభం 7 శాతం వృద్ధితో రూ. 4,265 కోట్లకు చేరింది. స్టాండెలోన్‌ నికర లాభం సైతం రూ. 2,792 కోట్ల నుంచి రూ. 3,005 కోట్లకు బలపడింది. డిబెంచర్ల జారీ ద్వారా రూ. 10,000 కోట్లు సమీకరించేందుకు బోర్డు అనుమతించినట్లు బ్యాంక్‌ తాజాగా వెల్లడించింది.  

వడ్డీ ఆదాయం అప్‌
ప్రస్తుత సమీక్షా కాలంలో కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ నికర వడ్డీ ఆదాయం 16 శాతం పుంజుకుని రూ. 6,554 కోట్లకు చేరగా.. నికర వడ్డీ మార్జిన్లు 5.47 శాతం నుంచి 5.22 శాతానికి స్వల్ప వెనకడుగు వేశాయి. ఇతర ఆదాయం రూ. 1,948 కోట్ల నుంచి రూ. 2,2,97 కోట్లకు ఎగసింది. మొత్తం ప్రొవిజన్లు రూ. 149 కోట్ల నుంచి రూ. 579 కోట్లకు పెరిగాయి. ఫలితంగా లాభాల్లో వృద్ధి పరిమితమైనట్లు వెల్లడించింది.

బ్యాంక్‌ ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం ప్రత్యామ్నాయ పెట్టుబడి ఫండ్స్‌(ఏఐఎఫ్‌లు)లో పెట్టుబడులకు రూ. 190 కోట్లమేర కేటాయింపులు చేపట్టినట్లు పేర్కొంది. అన్‌సెక్యూర్డ్‌ రుణాల కారణంగా తాజా స్లిప్పేజీలు రూ. 748 కోట్ల నుంచి రూ. 1,177 కోట్లకు పెరిగాయి. బ్యాంక్‌ పటిష్టస్థితిలో ఉన్నట్లు ఎండీ, సీఈవోగా కొత్తగా ఎంపికైన అశోక్‌ వాస్వాని స్పష్టం చేశారు. కనీస మూలధన నిష్పత్తి 20 శాతం నుంచి 19 శాతానికి వెనకడుగు వేసింది.
వారాంతాన బీఎస్‌ఈలో కొటక్‌ మహీంద్రా షేరు 2.3 % బలపడి రూ. 1,806 వద్ద ముగిసింది.

Advertisement
 
Advertisement