ద్వైపాక్షిక బంధాలు బలపడతాయ్‌ | Sakshi
Sakshi News home page

ద్వైపాక్షిక బంధాలు బలపడతాయ్‌

Published Mon, Nov 9 2020 5:30 AM

Joe Biden Presidency Could Change US-India Relations - Sakshi

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్, ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్‌ ఎన్నికవడాన్ని భారత పరిశ్రమ వర్గాలు స్వాగతించాయి. భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కావడానికి ఇది తోడ్పడగలదని ఆకాంక్షించాయి. ‘రెండు దేశాల మధ్య వాణిజ్య, పెట్టుబడుల బంధాలు పెరుగుతున్నాయి. ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పన, చిన్న వ్యాపారాలకు ఊతమివ్వడం వంటి ఉమ్మడి ఎజెండా అమలుకు ఇరు పక్షాలు కలిసి పనిచేయాలి‘ అని పరిశ్రమల సమాఖ్య సీఐఐ ప్రెసిడెంట్‌ ఉదయ్‌ కొటక్‌ తెలిపారు.

‘బైడెన్‌–కమలా సారథ్యంలో భారత్‌–అమెరికా ఆర్థిక సంబంధాలు మరింతగా బలపడగలవు. అధునాతన శాస్త్రీయ పరిశోధనలు.. అభివృద్ధి కార్యకలాపాలు, వ్యూహాత్మక రంగాల్లో వ్యాపార వర్గాల మధ్య సహకారం పెరగగలదు‘ అని అసోచాం సెక్రటరీ జనరల్‌ దీపక్‌ సూద్‌ తెలిపారు.  ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాలైన భారత్, అమెరికా మధ్య పటిష్టమైన సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక సంబంధాలు ఉన్నాయని .. ఇవి మరింత బలోపేతం కాగలవని పీహెచ్‌డీ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ ప్రెసిడెంట్‌ సంజయ్‌ అగర్వాల్‌ చెప్పారు.

నాయకత్వం అంటే విధానాలతో పాటు వ్యక్తిత్వం కూడా అన్న పాఠాన్ని అమెరికా ఎన్నికలు తెలియజేశాయని మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా అభిప్రాయపడ్డారు. 2019లో భారత్, అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం దాదాపు 150 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. పరస్పర ఆర్థిక సహకారంతో దీన్ని 500 బిలియన్‌ డాలర్ల లక్ష్యానికి చేర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకోవచ్చని సీఐఐ డైరెక్టర్‌ జనరల్‌ చంద్రజిత్‌ బెనర్జీ పేర్కొన్నారు.

స్వాగతించిన ఐటీ పరిశ్రమ..: జో బైడెన్‌ ఎన్నికపై దేశీ ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్‌ హర్షం వ్యక్తం చేసింది. ‘స్థానికంగా పెట్టుబడులు, ఉపాధి కల్పన వంటి చర్యల ద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థకు భార త టెక్నాలజీ రంగం కీలక తోడ్పాటు అందిస్తోంది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో నైపుణ్యాలను మెరుగుపర్చడం, మరిన్ని ఉద్యోగాలు కల్పించడం వంటి అంశాల్లో అమెరికా కొత్త ప్రభుత్వంతో కలిసి పనిచేయడంపై నాస్కామ్‌ ఆసక్తిగా ఎదురుచూస్తోంది‘ అని పేర్కొంది. ‘ఇది చారిత్రకమైన రోజు. అవరోధాలన్నీ తొలగిపోవడం హర్షించతగ్గ పరిణామం. ఏకత్వానికి, సమిష్టి తత్వానికి ఇది గెలుపు‘ అని సైయంట్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ బీవీఆర్‌ మోహన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.  ‘ప్రజాస్వామ్యం గెలిచింది‘ అని టెక్‌ మహీంద్రా ఎండీ సీపీ గుర్ణానీ ట్వీట్‌ చేశారు.  

Advertisement
Advertisement