ఐపీవోకు 4 కంపెనీలు రెడీ | Sakshi
Sakshi News home page

ఐపీవోకు 4 కంపెనీలు రెడీ

Published Fri, Jan 26 2024 4:45 AM

JNK India, Entero Healthcare, among 2 others receive SEBI approval for IPO launch - Sakshi

న్యూఢిల్లీ: ఇటీవల కళకళలాడుతున్న ప్రైమరీ మార్కెట్‌లో మరో నాలుగు కంపెనీలు సందడి చేయనున్నాయి. ఇందుకు క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి తాజాగా అనుమతులు పొందాయి. ఈ జాబితాలో ఎంటెరో హెల్త్‌కేర్‌ సొల్యూషన్స్, జేఎన్‌కే ఇండియా, ఎక్సికామ్‌ టెలీసిస్టమ్స్, అక్మే ఫిన్‌ట్రేడ్‌(ఇండియా) చేరాయి. 2023 జూన్‌– అక్టోబర్‌ మధ్య కాలంలో ఈ నాలుగు కంపెనీలు సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేశాయి.
కాగా.. స్టాలియన్‌ ఇండియా ఫ్లోరోకెమికల్స్‌ ఐపీవో దరఖాస్తును మాత్రం సెబీ తిప్పిపంపింది. వివరాలు చూద్దాం..

ఎంటెరో హెల్త్‌కేర్‌..
స్టాక్‌ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్‌కు వీలుగా ఎంటెరో హెల్త్‌కేర్‌ సొల్యూషన్స్‌ సెబీ నుంచి గ్రీన్‌సిగ్నల్‌ను అందుకుంది. ఐపీవోలో భాగంగా రూ. 1,000 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. ప్రాస్పెక్టస్‌ ప్రకారం వీటికి జతగా మరో 85.57 లక్షల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఎంటెరో హెల్త్‌ను 2018లో ప్రభాత్‌ అగర్వాల్, ప్రేమ్‌ సేథీ ఏర్పాటు చేశారు.

జేఎన్‌కే ఇండియా
పబ్లిక్‌ ఇష్యూ ద్వారా నిధులు సమీకరించేందుకు జేఎన్‌కే ఇండియా సెబీ నుంచి అనుమతి పొందింది. ఇష్యూలో భాగంగా రూ. 300 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. ప్రాస్పెక్టస్‌ ప్రకారం వీటికి జతగా మరో 84.21 లక్షల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు.  

అక్మే ఫిన్‌ట్రేడ్‌
ఐపీవోలో భాగంగా అక్మే ఫిన్‌ట్రేడ్‌(ఇండియా) 1.1 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. ప్రాస్పెక్టస్‌ ప్రకారం ఈక్విటీ జారీ నిధులను మూలధన పటిష్టతకు వినియోగించనుంది.  

ఎక్సికామ్‌టెలీ
టెలికం రంగ కంపెనీ ఎక్సికామ్‌ టెలీసిస్టమ్స్‌ లిమిటెడ్‌ పబ్లిక్‌ ఇష్యూ ద్వారా స్టాక్‌ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్‌కు సిద్ధపడుతోంది. దీనిలో భాగంగా రూ. 400 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి అదనంగా మరో 74 లక్షల షేర్లను ప్రమోటర్‌ సంస్థ నెక్ట్స్‌వేవ్‌ కమ్యూనికేషన్స్‌ విక్రయానికి ఉంచనుంది. ప్రస్తుతం నెక్ట్స్‌వేవ్‌కు కంపెనీలో 71.45 శాతం వాటా ఉంది. ఈక్విటీ జారీ నిధులను తెలంగాణలోని తయారీ యూనిట్‌లో ప్రొడక్షన్‌ లైన్ల ఏర్పాటుకు వినియోగించనుంది. మరికొన్ని నిధులను పరిశోధన, అభివృద్ధి, ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్, రుణ చెల్లింపులు, వర్కింగ్‌ క్యాపిటల్‌ అవసరాలకు వినియోగించనుంది.

 
Advertisement
 
Advertisement