
కొన్ని నెలలుగా ఐటీ పరిశ్రమలో చెప్పుకోదగిన లాభాలు ఉండడంలేదు. ప్రస్తుత త్రైమాసికంలో కంపెనీలు పోస్ట్ చేస్తోన్న ఫలితాల్లో చాలాభాగం లేఆఫ్స్, డిస్క్రీషనరీ వ్యయాన్ని తగ్గించుకోవడం వల్ల ఒనగూరిందే. అయితే సమీప భవిష్యత్తులో వీటిలో మార్పు రాబోతుందని అంచనాలు వెలువడుతున్నాయి. కృత్రిమ మేధస్సు (ఏఐ), డేటా ఆధునీకరణ, మెరుగైన డిజిటల్ అనుభవాల కోసం ఐటీ కంపెనీల కస్టమర్లు వ్యయాన్ని పెంచే అవకాశం ఉంది. ముఖ్యంగా బ్యాంకింగ్, బీమా, రిటైల్ రంగాల్లో విచక్షణాత్మక ఐటీ వ్యయం తిరిగి గాడినపడుతుందనే సంకేతాలు వస్తున్నాయి.
వ్యయాలు పెంపు
స్థూల ఆర్థిక ఒడిదుడుకులు, అంతర్జాతీయ టారిఫ్ అనిశ్చితుల మధ్య మొత్తం టెక్ బడ్జెట్లు స్తంభించాయి. సాంప్రదాయ ఐటీ కార్యకలాపాలను కంపెనీలు జాగ్రత్తగా నిర్వహిస్తున్నాయి. అయితే కృత్రిమ మేధ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఈమేరకు ఐటీ కస్టమర్ కంపెనీలు తమ వ్యయాన్ని పెంచుతున్నాయి. ఇది ఐటీ రంగానికి కలిసొచ్చే అంశం. వినియోగదారులు ఏఐ వాడకంవైపు మొగ్గు చూపడం కూడా ఐటీకి ఊతం ఇస్తుంది. జేపీ మోర్గాన్ చేజ్, బ్యాంక్ ఆఫ్ అమెరికా వంటి ప్రధాన యూఎస్ బ్యాంకులు ఏఐకి సంబంధించి ప్రయోగాత్మక దశలను దాటి పూర్తి స్థాయి, ఉత్పత్తి గ్రేడ్ ఏఐను వాడుతున్నాయి. ఈ పరివర్తన వ్యాపార ఫలితాలకు నేరుగా దోహదం చేస్తుంది.
ఏఐతో మేలు..
మల్టీ బిలియన్ డాలర్ల టెక్ బడ్జెట్ ఉన్న సంస్థలు ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా గణనీయమైన వార్షిక ఆదాయాన్ని సంపాదిస్తున్నట్లు ఫారెస్టర్ ప్రిన్సిపల్ అనలిస్ట్ బిశ్వజీత్ మహాపాత్ర అన్నారు. స్పష్టమైన ఉత్పాదకత లాభాల కోసం ఏఐ ఎంతో ఉపయోగపడుతోందని చెప్పారు. హైపర్-పర్సనలైజేషన్‌తో మెరుగైన కస్టమర్ అనుభవం చేకూరుతుందని చెప్పారు. ఏజెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కార్యకలాపాలను క్రమబద్ధీకరించే సామర్థ్యం పెరుగుతుందని పేర్కొన్నారు. ఇది ఐటీ కంపెనీలకు లాభాలు తెస్తుందని చెప్పారు. ప్రముఖ సంస్థల ఐటీ వ్యయంలో 50% కంటే ఎక్కువ కృత్రిమ మేధ, డేటా ఆధునీకరణ, కస్టమర్-ఫేసింగ్ ఇన్నోవేషన్ వైపు మళ్లిస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: హైదరాబాద్‌లో ప్లాట్ల అమ్మకాలకు అంతా సిద్ధం..
పూర్తి స్థాయిలో కేటాయింపులు పెండింగ్..
ఐటీ కంపెనీల కస్టమర్ సంస్థల విచక్షణ వ్యయంలో రికవరీ ఇంకా విస్తృతంగా లేదని నిపుణులు చెబుతున్నారు. అనేక సంస్థలు ఐటీ స్పెండింగ్ కోసం ఇంకా పూర్తి స్థాయిలో కేటాయింపులు జరపడంలేదు. దాంతో మొత్తం టెక్ బడ్జెట్లు 2026 ఆర్థిక సంవత్సరంలో ఫ్లాట్‌గా లేదా స్వల్ప లాభాల్లో మాత్రమే పెరుగుతాయని కొందరు భావిస్తున్నారు. ఏదేమైనా ఏఐ పుణ్యామా అని ఐటీ వ్యయంలో కొంత పురోగతి ప్రారంభమవుతున్నట్లు తెలుస్తుంది.