ఈ వెరిఫికేషన్‌ కోసం 68వేల ఐటీఆర్‌లు

It Department Picks 68,000 Itr Cases For E-verification - Sakshi

న్యూఢిల్లీ: రిటర్నుల్లో ఆదాయం తక్కువ చూపించడం లేదా అసలు చూపించకపోవడానికి సంబంధించి ఆదాయపన్ను శాఖ 2019–20 సంవత్సరానికి 68,000 ఐటీఆర్‌లను ఈ–వెరిఫికేషన్‌ కోసం ఎంపిక చేసుకుంది. ఈ విషయాన్ని ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) చీఫ్‌ నితిన్‌ గుప్తా తెలిపారు. పన్ను చెల్లింపుదారుల వార్షిక సమాచార నివేదిక (ఏఐఎస్‌)లోని వివరాలు, రిటర్నుల్లో పేర్కొన్న వివరాలకు మధ్య పోలిక లేకపోతే ఆదాయపన్ను శాఖ ఈ–వెరిఫికేషన్‌ నోటీసు జారీ చేస్తుంది.

దాంతో పన్ను చెల్లింపుదారులు సమాచారం మధ్య పోలిక లేకపోవడంపై వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ–వెరిఫికేషన్‌ నోటీసులో పేర్కొన్న సమాచారం నిజమేనని పన్ను చెల్లింపుదారులు గుర్తించినట్టయితే సవరించిన రిటర్నులు వేసి, అవసరమైతే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. తాము 68,000 పన్ను చెల్లింపుదారులకు నోటీసులు ఇవ్వగా.. 35,000 కేసుల్లో సంతృప్తికరమైన వివరణ ఇవ్వడం లేదంటే సవరించిన రిటర్నులు వేసినట్టు గుప్తా తెలిపారు. 

ఇప్పటి వరకు 15 లక్షల సవరించిన రిటర్నులు దాఖలయ్యాయని, వీటి రూపంలో రూ.1,250 కోట్లు వసూలైనట్టు చెప్పారు. మరో 33,000 కేసులకు సంబంధించి ఇంకా సమాధారం రాలేదని.. వారు సవరించిన రిటర్నులు (2019–20 సంవత్సరానికి) వేసేందుకు మార్చి 31 వరకు సమయం ఉందన్నారు. 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top