ఐపీవోకు ఐఆర్‌ఎం ఎనర్జీ

IPO: Irm Energy Files Draft Papers With Sebi To Raise Funds - Sakshi

న్యూఢిల్లీ: సిటీ గ్యాస్‌ పంపిణీ కంపెనీ ఐఆర్‌ఎం ఎనర్జీ లిమిటెడ్‌ పబ్లిక్‌ ఇష్యూ సన్నాహాలు ప్రారంభించింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్‌ మార్కెట్ల నియత్రంణ సంస్థ సెబీకి ప్రాథమిక ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఇష్యూలో భాగంగా 1.01 కోట్ల ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుంది. ఐపీవో ద్వారా రూ. 700 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉంది. ప్రస్తుతం కంపెనీలో ప్రమోటర్లకు 67.94 శాతం వాటా ఉంది.

దీనిలో క్యాడిలా ఫార్మాస్యూటికల్స్‌ వాటా 49.5 శాతంకాగా.. ఐఆర్‌ఎం ట్రస్ట్‌ లిమిటెడ్‌ మిగిలిన వాటాను కలిగి ఉంది. ఇష్యూ నిధులను ప్రధానంగా పెట్టుబడి అవసరాలకు వినియోగించనుంది. నమక్కల్, తిరుచిరాపల్లిలో సిటీ గ్యాస్‌ పంపిణీ అభివృద్ధిని చేపట్టనుంది. కంపెనీ పైప్‌డ్‌ నేచురల్‌ గ్యాస్‌(పీఎన్‌జీ), కంప్రెస్‌డ్‌ నేచురల్‌ గ్యాస్‌(సీఎన్‌జీ)లను సరఫరా చేస్తోంది. గుజరాత్, పంజాబ్, తమిళనాడుల్లో కార్యకలాపాలు విస్తరించింది. ఈ సెప్టెంబర్‌తో ముగిసిన ఆరు నెలల కాలంలో ఆదాయం రెట్టింపునకుపైగా ఎగసి రూ. 504 కోట్లను అధిగమించింది. 2020–21 ప్రథమార్ధంలో రూ. 205 కోట్ల టర్నోవర్‌ మాత్రమే సాధించింది. అయితే ముడిగ్యాస్‌ ధరల పెరుగుదల కారణంగా నికర లాభం 18 శాతం క్షీణించి రూ. 39 కోట్లకు పరిమితమైంది. గతేడాది ఇదే కాలంలో దాదాపు రూ. 48 కోట్లు ఆర్జించింది.

చదవండి: ఆర్థిక మాంద్యంలోనూ అదరగొట్టిన మల్టీబ్యాగర్‌ స్టాక్‌.. కలలో కూడా ఊహించని లాభం!
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top