ఐవోసి మాస్టర్‌ ప్లాన్‌.. అంబానీ, అదానీలే కాదు మేము వస్తున్నాం..

IOC Joint Venture With L and T On Green Hydrogen Project - Sakshi

ఐవోసీ–ఎల్‌అండ్‌టీ–రెన్యూ పవర్‌ జట్టు 

సంయుక్తంగా గ్రీన్‌ హైడ్రోజన్‌ తయారీ 

ఎల్‌అండ్‌టీ, ఐవోసీ విడిగా మరో జేవీ ఎలక్ట్రోలైజర్ల తయారీ  

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ ఆయిల్‌ కంపెనీ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐవోసీ), ఇంజనీరింగ్, మౌలిక రంగ దిగ్గజం ఎల్‌అండ్‌టీ, పునరుత్పాదక ఇంధన రంగంలోని రెన్యూ పవర్‌.. గ్రీన్‌ హైడ్రోజన్‌ తయారీకి జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించాయి. దీంతో గ్రీన్‌ హైడ్రోజన్‌ తయారీపై భారీ ప్రణాళికలను ప్రకటించిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్, అదానీ గ్రూపునకు ఈ జాయింట్‌ వెంచర్‌ గట్టీ పోటీనివ్వనుంది. 

సంయుక్తంగా గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్రాజెక్టుల అభివృద్ధికి గాను ఒప్పందంపై ఈ మూడు సంస్థలు సంతకాలు చేశాయి. అలాగే, ఐవోసీ, ఎల్‌అండ్‌టీ విడిగా మరో జాయింట్‌ వెంచర్‌ను ఏర్పాటు చేయనున్నాయి. దీని ద్వారా అవి గ్రీన్‌ హైడ్రోజన్‌ తయారీకి అవసరమైన ఎలక్ట్రోలైజర్లను తయారు చేయనున్నాయి. ఐవోసీ–ఎల్‌అండ్‌టీ–రెన్యూపవర్‌ ఐవోసీకి చెందిన మధుర, పానిపట్‌ రిఫైనరీల వద్ద గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్రాజెక్టుల ఏర్పాటుపై దృష్టి సారిస్తాయని సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనలో అవి పేర్కొన్నాయి.

గ్రీన్‌ హైడ్రోజన్‌ తయారీకి అవసరమైన పునరుత్పాదక ఇంధనాన్ని రెన్యూ పవర్‌ సరఫరా చేసే అవకాశం ఉంది. ‘‘మూడు సంస్థల మధ్య జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటు వల్ల.. ప్రాజెక్టుల డిజైన్, నిర్మాణంలో ఎల్‌అండ్‌టీకి ఉన్న అనుభవం, పెట్రోలియం రిఫైనరీలో ఐవోసీకి ఉన్న అనుభవం, ఇంధన చైన్‌ పట్ల అవగాహన, పునరుత్పాదక ఇంధనంలో రెన్యూపవర్‌కు ఉన్న అనుభవం కలసివస్తాయి’’ అని ఈ ప్రకటన తెలియజేసింది.

చదవండి: గ్రీన్‌ ఎనర్జీలో దూసుకుపోతున్న రిలయన్స్‌.. మరో కీలక నిర్ణయం
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top