గ్రీన్‌ ఎనర్జీలో దూసుకుపోతున్న రిలయన్స్‌.. మరో కీలక నిర్ణయం

Reliance Industries Acquired The UK Based Sodium Ion Battery Company Faradion - Sakshi

గ్రీన్‌ ఎనర్జీలో భారీ ఎత్తున పెట్టుబడులు పెడతామంటూ భవిష్యత్‌ ప్రణాళిక ప్రకటించిన రిలయన్స్‌ సంస్థ అందుకు తగ్గట్టుగా వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే జామ్‌నగర్‌ దగ్గర గిగా ఫ్యాక్టరీ పనులు కొనసాగిస్తూనే మరోవైపు గ్రీన్‌ టెక్నాలజీలో వివిధ సంస్థలతో జట్టు కడుతోంది రిలయన్స్‌.

సోడియం ఐయాన్‌ బ్యాటరీ టెక్నాలజీలో ప్రపంచంలోనే పేరెన్నికగల ఫారడియన్‌ కంపెనీని రియలన్స్‌ కొనుగోలు చేసింది. ఈ కంపెనీలో వంద శాతం వాటాలను కొనుగోలు చేసినట్టు రిలయన్స్‌ ప్రకటించింది. యూకేలోని ఆక్స్‌ఫర్డ్‌, షేక్‌ఫీల్డ్‌ బేస్‌డ్‌గా వ్యాపారం నిర్వహిస్తున్న ఈ కంపెనీ మార్కెట్‌ వ్యాల్యూ 100 మిలియన్‌ పౌండ్లుగా ఉంది. కాగా మరో 25 మిలియన్‌ పౌండ్లను ఫారడియన్‌ కంపెనీ విస్తరణ, ఆర్‌ అండ్‌ డీ కోసం రిలయన్స్‌ కేటాయించనుంది.

బ్యాటరీ తయారీలో వినియోగించే కోబాల్ట్‌, కాపర్‌, లిథియం, కాపర్‌, గ్రాఫైట్‌లతో పోల్చితే సోడియం ఉపయోగించడం సులువు. భూమిపై సోడియం నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి. కాబట్టి బ్యాటరీ తయారీ ఖర్చు గణనీయంగా తగ్గిపోతుంది. అంతేకాదు సోడియం ఐయాన్‌ బ్యాటరీలు త్వరగా ఛార్జ్‌ అవుతాయి.

న్యూ ఎనర్జీకి సంబంధించి మేము నిర్ధేశించుకున్న లక్ష్యాలను చేరడానికి ఫారడియన్‌ టేకోవర్‌ ఎంతగానో ఉపకరిస్తుందని రియలన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ అన్నారు. ఫారడియన్‌ దగ్గరున్న టెక్నాలజీని మరింత వేగంగా ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ఆయన ప్రకటించారు. ఫారడియన్‌ని రిలయన్స్‌ టేకోవర్‌ చేయడం మంచి పరిణామం అని ఆ సంస్థ సీఈవో జేమ్స్‌ క్విన్‌ అన్నారు. 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top