
ప్రాస్పెక్టస్ వెనక్కి తీసుకున్న కంపెనీ
న్యూఢిల్లీ: ఫెర్టిలిటీ క్లినిక్ చైన్ ఇందిరా ఐవీఎఫ్ హాస్పిటల్ పబ్లిక్ ఇష్యూ ప్రణాళికలను పక్కనపెట్టింది. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి ప్రాస్పెక్టస్‌ను వెనక్కి తీసుకుంది. కంపెనీ ఇంతక్రితం గోప్యతా మార్గంలో ఐపీవో చేపట్టేందుకు సెబీకి ముందస్తు దరఖాస్తు చేసింది. రహస్య ఫైలింగ్ చేసిన కంపెనీ సంబంధిత వివరాలను గోప్యంగా ఉంచేందుకు వీలుంటుంది. అంతేకాకుండా కచ్చితంగా పబ్లిక్ ఇష్యూ చేపట్టాలన్న నిబంధనలేమీ లేవు. ఫిబ్రవరి 13న సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను సమర్పించిన కంపెనీ కారణాలు వెల్లడించకుండా ఈ నెల 19న ఉపసంహరించుకుంది.
ఇంతక్రితం 2023లో హోటళ్ల అగ్రిగేటర్ ఓయో సెబీకి రహస్య ఫైలింగ్ చేసినప్పటికీ ఐపీవో చేపట్టలేదు. అయితే 2024లో రిటైల్ దిగ్గజం విశాల్ మెగామార్ట్, ఫుడ్ డెలివరీ దిగ్గజం స్విగ్గీ ఐపీవోలు చేపట్టి స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయ్యాయి. ఈ బాటలో గత వారం ఫిజిక్స్‌వాలా సైతం కాన్ఫిడెన్షియల్ రూట్‌లో సెబీకి పత్రాలు దాఖలు చేసింది. కాగా.. 2022 డిసెంబర్‌లో టాటా ప్లే(గతంలో టాటా స్కై) దేశీయంగా తొలిసారి రహస్య ఫైలింగ్ రూట్‌లో సెబీకి దరఖాస్తు చేసింది. 2023 ఏప్రిల్‌లో అనుమతి పొందినప్పటికీ ఐపీవోకు రాకపోవడం గమనార్హం!
అగ్రివేర్‌హౌసింగ్‌కు చెక్
అగ్రివేర్‌హౌసింగ్ అండ్ కొలేటరల్ మేనేజ్‌మెంట్ సంస్థ 2024 డిసెంబర్‌లో దాఖలు చేసిన ప్రాస్పెక్టస్‌ను సెబీ తాజాగా వెనక్కి పంపింది. టెక్నాలజీ ఆధారిత అగ్రికల్చర్ సర్విసులందించే కంపెనీ ఐపీవోలో భాగంగా రూ. 450 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయాలని భావించింది. వీటికి జతగా మరో 2.69 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచాలని ప్రణాళికలు వేసింది. వాటాదారుల్లో టెమాసెక్ 1.19 కోట్ల షేర్లు ఆఫర్ చేయనుంది. సాధారణ ఫైలింగ్ చేస్తే సెబీ అనుమతి పొందిన 12 నెలల్లోగా ఐపీవో చేపట్టవలసి ఉంటుంది.