ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ టర్న్‌అరౌండ్‌.. దశాబ్ద కాలంలోనే అత్యధిక లాభం

Indian Oil Corporation standalone net profit  Rs 13750 crore q1 - Sakshi

న్యూఢిల్లీ: ఇంధన రంగ ప్రభుత్వ దిగ్గజం ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌(ఐవోసీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికంలో టర్న్‌అరౌండ్‌ ఫలితాలు సాధించింది. ఏప్రిల్‌–జూన్‌(క్యూ1)లో రూ. 13,750 కోట్ల నికర లాభం(స్టాండెలోన్‌) ఆర్జించింది. ఇది గత దశాబ్ద కాలంలోనే అత్యధికంకాగా.. పెట్రోల్, డీజిల్‌పై లాభదాయకత(మార్జిన్లు) మెరుగుపడటం లాభాలకు కారణమైంది. 

గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 1,993 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గతేడాది క్యూ4(జనవరి–మార్చి)లో నమోదైన రూ. 10,059 కోట్లతో పోల్చినా తాజా లాభం 37 శాతం జంప్‌చేసింది. వెరసి ఇంతక్రితం 2021–22లో ఆర్జించిన రికార్డ్‌ వార్షిక లాభం రూ. 24,184 కోట్లలో సగానికిపైగా క్యూ1లో సాధించింది. కాగా.. గతంలో అంటే 2012–13 క్యూ4లో అధిక ఇంధన సబ్సిడీని అందుకోవడం ద్వారా రూ. 14,153 కోట్ల నికర లాభం నమోదైంది. 

గతేడాది క్యూ1లో పెట్రోల్, డీజిల్‌ రిటైల్‌ ధరలను నిలిపిఉంచడంతో ప్రభుత్వ రంగ ఇంధన దిగ్గజాలు బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్‌ సైతం నష్టాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుత సమీక్షా కాలంలో మొత్తం ఆదాయం 2 శాతం నీరసించి రూ. 2.21 లక్షల కోట్లకు పరిమితమైంది. ప్రతీ బ్యారల్‌ చమురుపై స్థూల రిఫైనింగ్‌ మార్జిన్లు 8.34 డాలర్లకు చేరాయి. ఇంధన అమ్మకాలు 0.6 మిలియన్‌ టన్నులు పెరిగి 21.8 ఎంటీని తాకాయి. ఈ కాలంలో 18.26 ఎంటీ చమురును ప్రాసెస్‌ చేసింది. ఫలితాల నేపథ్యంలో ఐవోసీ షేరు బీఎస్‌ఈలో 0.5 శాతం క్షీణించి రూ. 95 వద్ద ముగిసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top