హైదరాబాద్‌పై దేశీ రియల్టర్ల ఫోకస్‌.. కారణాలు ఇవే

Indian Legendary Realtors Focus On Hyderabad Land Deal - Sakshi

రియల్‌ ఎస్టేట్‌ రంగంలో దిగ్గజ కంపెనీలో హైదరాబాద్‌పై ఫోకస్‌ చేస్తున్నాయి. ముంబై, ఢిల్లీ, బెంగళూరు నగరాల కంటే భాగ్యనగరంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. అందువల్లే ఇటీవల రియల్టీ సెక్టార్‌లో నవాబుల నగరం ఇతర మెట్రో సిటీల కంటే ఎక్కువ దూకుడు కనబరుస్తోంది. 

దూసుకెళ్తోంది
ఇటీవల కూకట్‌పల్లి ఏరియాలో 10 ఎకరాల సింగిల్‌ బిట్‌ స్థలం రూ. 235 కోట్ల రూపాయలకు అమ్ముడైంది. ఈ ఏడాది దేశంలో ఇదే అతి పెద్ద రియల్టీ డీల్‌గా నిలిచింది. అంతే కాదు ఆఫీస్‌ స్పేస్‌కి సంబంధించి రెండో అతి పెద్ద డీల్‌కి కూడా హైదరాబాద్‌ నగరమే వేదికైంది.  పలు అంతర్జాతీయ సంస్థలు అందిస్తున్న నివేదికలు సైతం హైదరాబాద్‌ వృద్ధిని పట్టి చూపుతున్నాయి. 

అందుబాటు ధర
భౌగోళికంగా దేశానికి మధ్యలో ఉండటం ఇబ్బంది పెట్టని వాతవారణ పరిస్థితులు, ఐటీ సెక్టార్‌ విస్తరణ వంటి అంశాలు బెంగళూరు, హైదరాబాద్‌కి అనుకూలంగా ఉన్నాయి. దీంతో దేశంలోని నాలుగు ప్రధాన నగరాలతో పోటీ పడుతూ ఈ రెండు నగరాలు గత ఇరవై ఏళ్లలో శరవేగంగా అభివృద్ది చెందాయి. అయితే బెంగళూరుతో సహా దేశంలోని మిగిలిన మెట్రో సిటీల్లో భూముల లభ్యత తక్కువగా ఉంది. కానీ హైదరాబాద్‌లో భూమలు లభ్యత ఎక్కువ పైగా ధర కూడా తక్కువగా ఉంది. దీంతో ఇక్కడ భారీ ప్రాజెక్టులు చేపట్టేందుకు రియల్‌ ఎస్టేట్‌ దిగ్గజ కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి.

టీఎస్‌ బీపాస్‌
రియల్‌ ఎస్టేట్‌ సెక్టార్‌లో భారీ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలంటే ప్రభుత్వ అనుమతులు తీసుకోవడంలో చాలా జాప్యం జరుగుతోంది. మిగిలిన మెట్రో సిటీల్లో ఒక భారీ ప్రాజెక్టు నిర్మాణ అనుమతులకు 6 నెలల నుంచి ఏడాది వరకు సమయం పడుతుండగా టీఎస్‌ బీపాస్‌ విధానం కారణంగా హైదరాబాద్‌లో నెల రోజుల వ్యవధిలోనే అనుమతులు వస్తున్నాయి. రియల్టీ కంపెనీలకు ఈ విధానం ఎంతో అనుకూలంగా మారింది.

వేలానికి విలువైన స్థలాలు
హైదరాబాద్‌ నగరంలో అనేక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు విస్తరించి ఉన్నాయి. ఇందులో చాలా సంస్థల వందలు, వేల ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. ఇటీవల కేంద్రం డిజిన్వెస్ట్‌మెంట్‌ ప్రక్రియను వేగవంతం చేసింది. దీంతో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఆధీనంలో ఉన్న స్థలాలను విక్రయించడం లేదా లీజుకు ఇవ్వడం వంటి పనుల ద్వారా ఆదాయం సమకూర్చుకుంటోంది. తాజాగా నగరంలోని గచ్చిబౌలి ఏరియాలో బీఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థకు చెందిన స్థలం బహిరంగ మార్కెట్‌కి సేల్‌/లీజుకు రానున్నట్టు సమాచారం ఉంది. దీంతో దేశంలో వివిధ నగరాల్లో ఉన్న బడా రియల్టర్లు హైదరాబాద్‌పై ఫోకస్‌ పెట్టారని క్రెడాయ్‌ వర్గాలు అంటున్నాయి. బీఎస్‌ఎన్‌ఎల్‌తో పాటు ఇంకా హైదరాబాద్‌లో ప్రైమ్‌ ఏరియాలో ల్యాండ్స్‌ ఎక్కడ ఉన్నాయి ? ఎంత ధర? వేలానికి ఎప్పుడు వస్తుందంటూ ఎక్కువ మంది వాకాబు చేస్తున్నట్టు క్రెడాయ్‌ పేర్కొంది. 

చదవండి: ఆఫీస్‌ స్పేస్‌ డీల్‌.. ఈ ఏడాది దేశంలోనే రెండో పెద్ద లీజ్‌ అగ్రిమెంట్‌ హైదరాబాద్‌లో

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top