
న్యూఢిల్లీ: అమెరికా ప్రతీకార టారిఫ్‌లతో తలెత్తబోయే ప్రతికూల ప్రభావాల గురించి దేశీ కార్పొరేట్లు ఆందోళన చెందరాదని గోద్రెజ్ అండ్ బాయిస్ సీఎండీ జంషీద్ గోద్రెజ్ సూచించారు. దాని బదులు మరింతగా పోటీపడే సామర్థ్యాలను పెంచుకోవడంపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.
పోటీతత్వాన్ని పెంపొందించుకునేందుకు భారతీయ తయారీ సంస్థలు, చైనాలాగా భారీ స్థాయిలో తయారీపై ఫోకస్ చేయాల్సి ఉంటుందని గోద్రెజ్ వివరించారు. తమ ఎగుమతులపై భారత్ విధిస్తున్న స్థాయిలోనే ఏప్రిల్ 2 నుంచి భారత్ ఎగుమతులపై తాము కూడా సుంకాలు విధిస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ఈ అంశంపై వ్యాపారవర్గాల్లో ఆందోళన నెలకొంది.
పలు భారతీయ కంపెనీలు అంతర్జాతీయంగా విజయవంతంగా కార్యకలాపాలు సాగిస్తున్నప్పటికీ స్థానిక కంపెనీలు తయారీ విషయంలో ఇంకా వెనుకబడి ఉన్నాయని గోద్రెజ్ చెప్పారు. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) తయారీ రంగ వాటా గణనీయంగా తగ్గిందని, దీన్ని స్థూల దేశీయోత్పత్తిలో నాలుగో వంతుకు పెంచుకోవాలన్న లక్ష్యం ఇంకా నెరవేరలేదని తెలిపారు.