భారత ఎకానమీ వృద్ధిపై వివేక్‌ దేవరాయ్‌ కీలక వ్యాఖ్యలు

Indian economy can touch usd 20 trillion by 2047says Bibek Debroy - Sakshi

ప్రధాని ఆర్థిక సలహా మండలిచైర్మన్‌ వివేక్‌ దేవ్‌రాయ్‌ విశ్లేషణ

2047 నాటికి ‘ఎగువ మధ్య తరగతి’ దేశంగా భారత్‌

25 యేళ్లు 7 నుంచి 7.5 శాతం శ్రేణి వృద్ధి సాధిస్తే 

 20 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీగా ఆవిర్భవిస్తామని భరోసా 

న్యూఢిల్లీ: భారత్‌ ఆర్థిక వ్యవస్థ రానున్న 25 సంవత్సరాల్లో వార్షికంగా సగటున 7 నుంచి 7.5 శాతం వృద్ధి రేటును సాధిస్తే, దేశం 2047 నాటికి ‘ఎగువ మధ్య తరగతి’ ఆదాయ దేశంగా ఆవిర్భవిస్తుందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ-పీఎం) చైర్మన్‌ వివేక్‌ దేవ్‌రాయ్‌ పేర్కొన్నారు. అదే విధంగా దేశం అప్పటికి 20 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీగా ఆవిర్భవిస్తుందని కూడా విశ్లేషించారు. తలసరి ఆదాయం 10,000 డాలర్లకు చేరుతుందని అన్నారు. దీనివల్ల భారత్‌ సమాజ స్వభావం పూర్తిగా రూపాంతరం చెందుతుందని పేర్కొన్నారు. ఒక దేశ తలసరి ఆదాయం 12,000 డాలర్లు దాటితే ఆ దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా పరిగణించాలని ప్రపంచ బ్యాంక్‌ సూచిస్తోంది.  

రాష్ట్రాలదే కీలకపాత్ర... 
ప్రస్తుతం భారత్‌ ఎకానమీ విలువ 2.7 ట్రిలియన్‌ డాలర్లు. ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశంగా అతిపెద్ద ఆరవ ఆర్థిక వ్యవస్థ హోదాను పొందుతోంది. 2047 నాటికి దేశం అభివృద్ధి చెందిన దేశంగా ఆవిర్భవించాలని ప్రధాని మోదీ లక్షించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘ది కాంపిటేటివ్‌నెస్‌ రోడ్‌మ్యాప్‌ ఫర్‌ ఇండియా@100’ పేరుతో వివేక్‌ దేవ్రాయ్‌ ఈ నివేదికను విడుదల చేశారు. హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌కు చెందిన ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ కాంపిటీటివ్‌నెస్‌ ప్రొఫెసర్‌ మైఖేల్‌ ఇ పోర్టర్, క్రిస్టియన్‌ కెటెల్స్, అమిత్‌ కపూర్‌లతో భాగస్వామ్యంతో ఈ ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి నివేదిక రూపొందింది.  దేశాభివృద్ధిలో రాష్ట్రాల పాత్ర కీలకమని పేర్కొన్న ప్రధాని ఆర్థిక సలహాదారు, రాష్ట్రాలు తమ వృద్ధి రికార్డులను ఎంత ఎక్కువగా నమోదుచేస్తే అంత ఎక్కువగా భారత్‌ పురోగతి సాధ్యమవుతుందని నివేదిక విడుదల సందర్భంగా దేవ్రాయ్‌ పేర్కొన్నారు. 1947లో బ్రిటీష్‌ పాలన నుండి స్వాతంత్య్రం వచ్చినప్పుడు భారత్‌ను ’మూడో–ప్రపంచ’ దేశంగా వర్గీకరించారు. అయితే  గత ఏడు దశాబ్దాలలో దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) కేవలం రూ. 2.7 లక్షల కోట్ల నుండి రూ. 150 లక్షల కోట్లకు పెరిగింది. 

నివేదికకు సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు.. 
♦ వృద్ధి, పోటీతత్వ పెంపొందడం కోసం ఒక పొందికైన వ్యూహాన్ని అనుసరించాలి. ఇందుకు దేశం పారిశ్రామిక, ప్రాంతీయ విధానాలను పునర్‌వ్యవస్థీకరించాలి. రంగాల వారీగా, ప్రాంతాల వారీగా వృద్ధికి విధాన రూపకల్పన జరగాలి.  
♦ భారత్‌ ఎకానమీ ఫండమెంటల్స్, స్థూల దేశీయోత్పత్తి పరిస్థితులు బలంగా ఉన్నాయి. ప్రపంచంలోనే భారత్‌ ఎకానమీ వేగంగా పురోగమిస్తోంది. అయితే బలహీన సామాజిక పురోగతి, పెరుగుతున్న అసమానతలు, ప్రాంతాల మధ్య సమన్వయం లేకపోవడం వంటి అంశాల వల్ల చాలా మంది భారతీయుల జీవన నాణ్యతలో ఆశించిన మెరుగుదలను సాధించలేకపోతున్నాం.  
♦ ఉపాధిని పెంపొందించే,  ఉద్యోగార్ధులకు అడ్డంకులను తగ్గించే సామాజిక విధానాలను భారతదేశం ప్రారంభించాల్సిన అవసరం ఉంది.  
♦ తగిన విధంగాలేని, కాలం చెల్లిన నియంత్రణ పరమైన నిబంధనలు,  వ్యవస్థాపరమైన లోటుపాట్లు భారతదేశాన్ని వెనక్కి నెడుతున్నాయి.  
♦  కార్మిక చట్టాలు పెద్ద సంస్థలపై అధిక వ్యయాల భారాలకు కారణమవుతున్నాయి. భూ చట్టాల వల్ల తరచుగా అభివృద్ధి కోసం భూమిని పొందడం కష్టతరం అవుతోంది. ఆయా అంశాల్లో కీలక సంస్కరణలు జరగాలి. ఇక జనాభాకు తగ్గట్టుగా వ్యవసాయ వస్తువులు, ఉత్పత్తుల ధరలను స్థిరంగా ఉంచండంపై దృష్టి సారించాలి.  
♦ భారత్‌ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా విదేశీ వాణిజ్యం, పెట్టుబడులకు మరింత ద్వారాలు తెరిచింది.  అయితే ఇప్పటికీ అడ్డంకులు ఉన్నాయి. ముఖ్యంగా టారిఫ్‌ యేతర అడ్డంకులు మరింత తగ్గాలి. ప్రపంచ మార్కెట్‌లకు సేవలను అందించడానికి సంబంధించి ఒక ఆకర్షణీయ స్థానం సంపాదించడానికి విధాన రూపకల్పన భారత్‌ ముందు ప్రస్తుతం ఉన్న అతిపెద్ద సవాలు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top