పెద్ద విమానాలు సమకూర్చుకోవాలి

Indian Carriers Need To Have More Wide-Body Planes - Sakshi

సుదీర్ఘ రూట్లలో అవకాశాలు అందిపుచ్చుకోవాలి

ఎయిర్‌లైన్స్‌కు కేంద్ర మంత్రి సింధియా సూచన

న్యూఢిల్లీ: వచ్చే దశాబ్ద కాలంలో భారత ఏవియేషన్‌ మార్కెట్‌ రెండంకెల స్థాయిలో వృద్ధి చెందనున్న నేపథ్యంలో  దేశీ ఎయిర్‌లైన్స్‌ సుదీర్ఘ ప్రయాణాల విభాగంలో అవకాశాలను అందిపుచ్చుకోవడంపై మరింతగా దృష్టి పెట్టాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సూచించారు. ఇందుకోసం మరిన్ని పెద్ద విమానాలను (వైడ్‌–బాడీ) సమకూర్చుకోవాలని పేర్కొన్నారు. ముంబై నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు గురువారం ఎయిరిండియా డైరెక్ట్‌ ఫ్లయిట్‌ను ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు.

‘దాదాపు 86 అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్‌ .. భారత్‌కు విమానాలు నడిపిస్తున్నాయి. కానీ మన దగ్గర్నుంచి కేవలం అయిదు సంస్థలకే అంతర్జాతీయ రూట్లలో సర్వీసులు ఉన్నాయి. అయితే, ఈ అయిదింటికీ 36 శాతం మా­ర్కె­ట్‌ వాటా ఉంది. మనం అంతర్జాతీయ ప్రయా­ణికుల ట్రాఫిక్‌పై దృష్టి పెట్టాలి. ఇందులో భాగంగానే సుదీర్ఘ రూట్ల మార్కెట్‌లో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు మరిన్ని వైడ్‌ బాడీ ఎయిర్‌క్రాఫ్ట్‌లను సమకూర్చుకోవాలని మన ఎయిర్‌లైన్స్‌ను కోరుతున్నాను‘ అని మంత్రి చెప్పారు.

టాటా గ్రూప్‌లో భాగంగా ఉన్న ఎయిరిండియా.. సుదీర్ఘ రూట్లలో మరింతగా విస్తరించగలదని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. 2023 తొలినాళ్లలో ఎయిరిండియా.. ముంబై నుంచి న్యూయార్క్, ప్యారిస్, ఫ్రాంక్‌ఫర్ట్‌కు కూడా ఫ్లయిట్స్‌ ప్రారంభించనుంది.  మరోవైపు, 2013–14లో 6.3 కోట్లుగా ఉన్న విమాన ప్రయాణికుల సంఖ్య 2019–20లో 14.4 కోట్లకు చేరిందని ఆయన తెలిపారు. గడిచిన ఎనిమిదేళ్లలో ఎయిర్‌పోర్టులు, హెలిపోర్టులు, వాటర్‌డ్రోమ్‌ల సంఖ్య 145కి పెరిగిందని చెప్పారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top