సాక్షి, న్యూఢిల్లీ: పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు వైఫల్యంపై దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్న సమయంలో.. ఆయనను జాకీలు పెట్టి లేపేందుకు టీడీపీ ఎంపీలు నడుంబిగించారు. ఇందుకోసం రెండు రోజుల క్రితం ‘ఎక్స్’లో అనుకూలమైన ట్వీట్లు చేయగా.. సోమవారం రాత్రి ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయులు, బీకే పార్ధసారధి, నాగరాజు, ప్రసాదరావు, లక్ష్మీనారాయణ, మాగుంట శ్రీనివాస్ రెడ్డి, రాజ్యసభ ఎంపీలు సాన సతీష్, బీద మస్తాన్‌రావు మీడియా సమావేశాన్ని నిర్వహించారు.
రెండు రోజుల క్రితం కేంద్ర మంత్రి కేవలం ఎల్లో మీడియాను పిలిపించుకుని ఆయనకు నచ్చిన వార్తలు వచ్చేలా ప్లాన్ చేసుకున్నారు. ఇప్పుడు మీడియా సమావేశం బాధ్యతను ఎంపీలకు అప్పజెప్పారు. ఈసందర్భంగా లావు శ్రీకృష్ణదేవరాయులు మాట్లాడుతూ.. చాలా మంది చాలా రకాలుగా రామ్మోహన్ నాయుడుపై బురద జల్లుతున్నారన్నారు. సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేసేవారికి సరైన అవగాహన ఉండదని, వాళ్లు ముందూ వెనకా తెలియకుండా మాట్లాడతారని విమర్శించారు.
ప్రతిపక్ష పార్టీలు, సోషల్ మీడియా వాళ్లు పూర్తి వివరాలు తెలుసుకోకుండా బురద జల్లుతున్నట్లు చెప్పుకొచ్చారు. దేశవ్యాప్తంగా మంత్రిని రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు, కేంద్ర మంత్రిగా సమాధానం చెప్పాల్సింది రామ్మోహన్ కదా? మీరెందుకు చెబుతున్నారని మీడియా ప్రశ్నించగా.. ‘‘పార్టీ పరంగా మేం చెప్పాల్సింది మేం చెబుతున్నాం, కేంద్ర మంత్రిగా ఆయన సమాధానం చెప్పాల్సిన చోట అంటే రాజ్యసభలో అందరికీ సమాధానం చెప్పారు. మేం మా వెర్షన్ మేం చెప్పాలి కాబట్టి మేం చెబుతున్నాం’’ అని లావు చెప్పుకొచ్చారు.


