సాక్షి, తిరుమల: ఏపీలో కూటమి ప్రభుత్వంలో తిరుమలలో వరుస అపచారాలు వెలుగు చూస్తున్నాయి. టీటీడీ భద్రతా సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా తిరుమలలో వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా తిరుమల శ్రీవారి ఆలయ పరిసరాల్లో ఓ కొత్త జంట ఫోటో షూట్ చేయడం వివాదానికి దారి తీసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వివరాల మేరకు.. తిరుమలలోని శ్రీవారి ఆలయ పరిసరాల్లో ఓ కొత్త జంట ఫోటో షూట్ తీసుకున్నారు. గొల్లమండపం నుండి అఖిలాండం వరకు నిబంధనలకు విరుద్ధంగా ఆ జంట వివిధ భంగిమల్లో ఫోటోలు తీసుకున్నారు. ముద్దులు కూడా పెట్టుకున్నారు. సదరు జంట ఇలా ఫొటోలు, వీడియోలు దిగడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమలలో ఫోటో షూట్లు, రీల్స్ చేయడంపై నిషేధం ఉన్నప్పటికీ, భద్రతా సిబ్బంది పట్టించుకోకపోవడం లేదంటూ భక్తులు మండిపడుతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు టీటీడీ భద్రతా సిబ్బందిపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీటీడీ కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.


