ఫస్ట్‌టైమ్‌.. ఐటీని వెనక్కినెట్టిన బ్యాంకింగ్‌ | Sakshi
Sakshi News home page

ఫస్ట్‌టైమ్‌.. ఐటీని వెనక్కినెట్టిన బ్యాంకింగ్‌

Published Mon, May 20 2024 5:47 PM

Indian banking sector surpassed IT as net profit tops Rs 3 lakh crore in FY24

దేశంలో ఐటీ రంగాన్ని వెనక్కి నెట్టి బ్యాంకింగ్‌ రంగం సరికొత్త మైలురాయిని సాధించింది. తొలిసారిగా 2024 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగ్‌ రంగం నికర లాభం రూ. 3 లక్షల కోట్లను అధిగమించింది. లిస్టెడ్ పబ్లిక్, ప్రైవేట్ రంగ బ్యాంకుల సంయుక్త నికర లాభం 2023 ఆర్థిక సంవత్సరంలో ఉన్న రూ. 2.2 లక్షల కోట్లతో పోలిస్తే 39 శాతం పెరిగి రూ. 3.1 లక్షల కోట్లకు చేరుకుందని టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా నివేదించింది.

ఐటీ రంగాన్ని దాటి.. 
ఇటీవలి కాలంలో సాంప్రదాయకంగా అత్యంత లాభదాయక రంగంగా ఉన్న ఐటీ  సేవల రంగాన్ని బ్యాంకుల లాభాలు అధిగమించాయి. 2024లో లిస్టెడ్ ఐటీ సేవల కంపెనీలు రూ. 1.1 లక్షల కోట్ల నికర లాభాన్ని నమోదు చేశాయి. ఇది బ్యాంకులు ఆర్జించిన లాభాల కంటే చాలా తక్కువ.

ప్రభత్వ, ప్రైవేట్ బ్యాంకుల లాభాలు ఇలా.. 
ఏడాది కాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు రికార్డు స్థాయిలో రూ.1.4 లక్షల కోట్ల నికర లాభాన్ని సాధించాయి. గత ఏడాదితో పోలిస్తే ఇది 34 శాతం పెరిగింది. ఇదిలా ఉండగా, ప్రైవేట్ రంగ బ్యాంకుల నికర లాభం 42 శాతం పెరిగి దాదాపు రూ.1.7 లక్షల కోట్లకు చేరుకుంది. ఇది ఏడాది క్రితం రూ.1.2 లక్షల కోట్లుగా ఉంది.

ప్రధాని ట్వీట్‌ 
దేశంలో బ్యాంకింగ్‌ రంగం రికార్డ్‌ స్థాయి లాభాలు సాధించడంపై హర్షం వ్యక్తం చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్‌ చేశారు.  ‘గత 10 సంవత్సరాలలో చెప్పుకోదగ్గ మలుపు. భారతదేశ బ్యాంకింగ్ రంగ నికర లాభం మొదటిసారిగా రూ. 3 లక్షల కోట్లు దాటింది. బ్యాంకుల లాభాలు మెరుగుపడటం పేదలు, రైతులు, ఎంఎస్‌ఎంఈలకు రుణ లభ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది’ అని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement