Starlink Satellite Internet: 'జియో' కంటే తక్కువ ధరకే శాటిలైట్‌ ఇంటర్నెట్‌..!

India Starlink Sanjay Bhargava Says Planning To Subsidize Cost For India - Sakshi

భారతీయులకు శుభవార్త. త్వరలో శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవలు జియో కంటే తక్కువ ధరకే లభించనున్నాయి. ఇప్పటికే జియో భారత టెలికాం రంగంలో సంచలనాలను నమోదుచేసింది.అతి తక్కువ ధరలో 4జీ ఇంటర్నెట్‌ను అందించిన మొబైల్‌ నెట్‌వర్క్‌ సంస్థగా జియో నిలిచింది. పలు కంపెనీలు తమ టారిఫ్‌ వాల్యూలను తగ్గించాల్సి వచ్చింది. జియో రాకతో ఇంటర్నెట్‌ రంగంలో పెనుమార్పులే వచ్చాయి. అయితే ఇప్పుడు జియో కంటే తక్కువ ధరకే శాటిలైట్‌ ఇంటర్నెట్‌ను అందించేందుకు స్పేస్‌ ఎక్స్‌ అధినేత ఎలన్‌ మస్క్‌ సిద్ధమయ్యారు. ఈ మేరకు ఎలన్‌ మస్క్‌ కేంద్రం ప్రభుత్వంతో చర్చలు జరపనున్నారు. ఆ చర్చలు కొలిక్కి వస్తే మనదేశంలో ఇంటర్నెట్‌ యూజర్లకు శాటిలైట్‌ ఇంటర్నెట్‌ ధరలు అతితక్కువ ధరకే లభించనున్నాయి.      

భారత్‌లో శాటిలైట్‌ ఇంటర్నెట్‌
త్వరలో ఎలన్‌ మస్క్‌కు చెందిన స్టార్‌ లింక్‌  శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవలు భారత్‌లో అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ శాటిలైట్‌ ఇంటర్నెట్‌ ధరలు ఎలా ఉంటాయనే అంశంపై చర్చ జరుగుతుండగా.. స్టార్‌ లింక్‌ స్పందించింది. భారతీయులకు అనుగుణంగా శాటిలైట్‌ ఇంటర్నెట్‌ను సబ్సిడీకి అందివ్వనున్నట్లు తెలిపింది. వెలుగులోకి వచ్చిన పలు నివేదికల ప్రకారం..మనదేశంలో స్టార్‌లింక్ తన సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లను సబ్సిడీ రేట్లతో అందించే ఆలోచనలో ఉన్నట్లు స్టార్‌లింక్‌కి ఇండియా హెడ్‌ సంజయ్ భార్గవ తెలిపారు. భారత్‌లో స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ ధర తక్కువగా ఉంటాయని అన్నారు. వినియోగదారులు చెల్లించే ధరలకంటే అందించే సేవలు ఎక్కువగా ఉండాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు. స్టార్‌ లింక్‌ ప్రస్తుతం దేశంలోని అంతర్గత ప్రాంతాలపై దృష్టి సారించినట్లు వెల్లడించారు. ఇక్కడ ఇంటర్నెట్ సేవల్ని యాక్సెస్ చేయడం చాలా కష్టం. తక్కువ ధర, సరైన సదుపాయల్ని కల్పించడం ద్వారా శాటిలైట్‌ ఇంటర్నెట్ రూపురేకల్ని మార్చవచ్చని అన్నారు.  

శాటిలైట్‌ ఇంటర్నెట్‌ ధరలు 
స్పేస్‌ఎక్స్‌ సంస్థ ఈ ఏడాది ప్రారంభంలో భారత్‌లో స్టార్‌లింక్ ఇంటర్నెట్‌ కోసం బుకింగ్‌లను ప్రారంభించింది. బుకింగ్‌లో భాగంగా కొనుగోలుదారులు రూ.7,500 డిపాజిట్ చెల్లించాలి.అలా చెల్లించిన వారికి ప్యాకేజీలో భాగంగా, స్టార్‌లింక్ డిష్ శాటిలైట్, రిసీవర్, సెటప్ చేయడానికి అవసరమైన అన్ని పరికరాలను అందిస్తుంది. ప్రారంభంలో ఇంటర్నెట్‌ స్పీడ్‌ 100-150ఎంబీపీఎస్‌ పరిధిలో ఉంటుంది. అయితే, తక్కువ భూ కక్ష్యలో మరిన్ని స్టార్‌లింక్ శాటిలైట్లను పంపడం ద్వారా ఇంటర్నెట్‌ వేగం జీబీపీఎస్‌కి చేరుకోవచ్చని స్టార్‌లింక్‌ ప్రతినిధులు భావిస్తున్నారు.ప్రస్తుతం ఈ ప్రయోగం ప్రారంభదశలోఉండగా..వచ్చే ఏడాది జూన్‌ జులై నాటికి కమర్షియల్‌ సర్వీసులు అందుబాటులోకి  తీసుకొని రానున్నారు.   

100 స్కూళ్లకు ఉచితం
నివేదికలో భాగంగా శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సెటప్‌ను స్టార్‌లింక్ సంస్థ 100 పాఠశాలలకు ఉచితంగా అందజేస్తుందని, వాటిలో 20 సెటప్‌లు ఢిల్లీ పాఠశాలలకు, మిగిలిన 80 సెటప్‌లు ఢిల్లీ చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల్లో పంపిణీ చేయనున్నట్లు స్టార్‌లింక్‌ ఇండియా బాస్‌ సంజయ్ భార్గవ స్పష్టం చేశారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top