
సేవల రంగం జూన్ నెలలో బలమైన పనితీరు చూపించింది. ఇందుకు నిదర్శనంగా హెచ్‌ఎస్‌బీసీ ఇండియా సర్వీసెస్ పీఎంఐ బిజెనెస్ యాక్టివిటీ ఇండెక్స్ పది నెలల గరిష్ట స్థాయిలో 60.4 పాయింట్లకు చేరింది. మే నెలలో ఇది 58.8 పాయింట్ల వద్ద ఉంది. స్థానిక మార్కెట్ నుంచే కాకుండా ఎగుమతి మార్కెట్ల నుంచి కొత్త ఆర్డర్లు రావడం బలమైన పనితీరుకు దోహదం చేసింది. వ్యయాలు తగ్గడం మార్జిన్ల విస్తరణకు దోహదం చేసినట్టు హెచ్‌ఎస్‌బీసీ ఇండియా ముఖ్య ఆర్థికవేత్త ప్రంజుల్ భండారీ తెలిపారు.
2024 ఆగస్ట్ తర్వాత తొలిసారి కొత్త ఆర్డర్లు జూన్ నెలలో గణనీయంగా పెరిగాయి. దేశీ మార్కెట్లో కార్యకలాపాలు పెరగడం, ఎగుమతులు వృద్ధి చెందడం మెరుగైన పనితీరుకు సాయపడ్డాయి. ముఖ్యంగా ఆసియా, మధ్యప్రాచ్యం, యూఎస్ మా ర్కెట్ల నుంచి డిమాండ్ అధికమైందని భండారీ అంచనా వేశారు. వరుసగా 37వ నెలలోనూ జూన్‌లో ఉపాధి అవకాశాలు పెరిగినట్టు చెప్పారు. వచ్చే ఏడాది కాలంలో వృద్ధి పట్ల 18% సేవల రంగ సంస్థలు సానుకూలంగా ఉన్నాయి. 2022 తర్వాత చూస్తే ఇదే కనిష్ట స్థాయి.
ఇదీ చదవండి: ‘జియో డేటా సెంటర్లలో వాడే జీపీయూలు మావే’
61పాయింట్లకు కాంపోజిట్ ఇండెక్స్
తయారీ, సేవల రంగ కార్యకలాపాలను ప్రతిబింబించే హెచ్‌ఎస్‌బీసీ ఇండియా కాంపోజిట్ పీఎంఐ అవుట్‌పుట్ ఇండెక్స్ జూన్‌లో 61 పాయింట్లకు పెరిగింది. మే నెలలో ఇది 59.3గా ఉంది. 14 నెలల్లోనే ఇది గరిష్ట స్థాయి కావడం గమనార్హం.