హెచ్‌ఎస్‌బీసీ పీఎంఐ 59.2కు చేరిక
సెప్టెంబర్‌లో ఇది 57.7 పాయింట్లే
వస్తు, సేవల పన్నులో (జీఎస్‌టీ) తీసుకొచ్చిన సంస్కరణలతో అక్టోబర్ నెలలో తయారీ రంగం బలమైన పనితీరు చూపించింది. హెచ్‌ఎస్‌బీసీ ఇండియా తయారీ పర్చేజింగ్ మేనేజర్స్ సూచీ (పీఎంఐ) సెప్టెంబర్‌లో ఉన్న 57.7 నుంచి అక్టోబర్‌లో 59.2 పాయింట్లకు పుంజుకున్నది. ఈ వివరాలను హెచ్‌ఎస్‌బీసీ ఇండియా విడుదల చేసింది. వినియోగ డిమాండ్ బలంగా ఉండడం తయారీ విస్తరణకు దోహదం చేసిందని, ఉపాధి కల్పనకు దారితీసిందని హెచ్‌ఎస్‌బీసీ ఇండియా ముఖ్య ఆర్థికవేత్త ప్రంజుల్ భండారీ తెలిపారు.
కొత్త ఎగుమతి ఆర్డర్లు బలంగా లేకపోయినప్పటికీ, దేశీయంగా వినియోగం (కొనుగోళ్లు) పెరగడం అక్టోబర్‌లో వృద్ధికి దోహదపడినట్టు ఈ సర్వే నివేదిక తెలిపింది. తయారీ రంగంలో పర్చేజింగ్ మేనేజర్ల అభిప్రాయాలను సర్వే చేసి ప్రతి నెలా హెచ్‌ఎస్‌బీసీ ఇండియా నివేదికను విడుదల చేస్తుంటుంది. తయారీ రంగంలో కార్యకలాపాల తీరును ఇది ప్రతిఫలిస్తుంది. ‘‘మూడో త్రైమాసికం కావడంతో కొత్త ఆర్డర్లు పెరిగాయి. వృద్ధికి జీఎస్‌టీ సంస్కరణలు, డిమాండ్ పుంజుకోవడం, ప్రకటనలు సాయపడినట్టు కంపెనీలు పేర్కొంటున్నాయి. మొత్తానికి తయారీ రంగ పనితీరు అక్టోబర్‌లో ఎంతో బలంగా, చురుగ్గా కనిపించింది’’అని హెచ్‌ఎస్‌బీసీ ఇండియా నివేదిక తెలిపింది.
డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి కోసం కంపెనీలు ముడి సరుకులను, సెమీ ఫినిష్డ్ వస్తువుల కొనుగోలును పెంచినట్టు వెల్లడించింది. తయారీలోకి వినియోగించే వస్తువుల ధరలు సగటున తగ్గగా.. వ్యయ భారాన్నిను వినియోగదారులకు బదలాయించడంతో విక్రయ ధరలు పెరిగినట్టు పేర్కొంది. ఉపాధి కల్పన వరుసగా 20వ నెల అక్టోబర్‌లోనూ సానుకూలంగా ఉన్నట్టు తెలిపింది.
ఇదీ చదవండి: పెట్టుబడి వెనక్కి తీసుకుంటే పెనాల్టీ కట్టాలా?

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
