
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా గత పదేళ్లలో భారీగా అక్రమంగా తరలిస్తున్న బంగారం స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. 2015–16 నుంచి 2024–25 ఆర్థిక సంవత్సరం వరకు పదేళ్లలో అక్రమంగా తరలిస్తున్న 31,772.34 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది.
ఇందుకు సంబంధించి 35,888 కేసులు నమోదు చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ వివరించింది. అత్యధికంగా 2023–24 ఆర్థిక సంవత్సరంలో 4,971.68 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది.

కేంద్ర ఆర్థిక శాఖ సమాచారం ప్రకారం.. 2015–16 ఆర్థిక సంవత్సరం నుంచి 2024–25 వరకు దేశవ్యాప్తంగా అక్రమంగా తరలిస్తున్న బంగారం స్వాధీనం చేసుకున్న కేసుల సంఖ్య 35,888కి చేరింది. మొత్తం 31,772.34 కిలోల బంగారం సీజ్ చేశారు. 2015–16లో 2,815 కేసులు నమోదు కాగా, 2,972.07 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. 2016–17లో కేసుల సంఖ్య 1,573కి తగ్గినా, 1,520.24 కిలోల బంగారం పట్టుబడింది. 2017–18లో 3,131 కేసులతో పాటు 3,329.46 కిలోల బంగారం స్వాధీనం కాగా, 2018–19లో కేసులు 5,092కి పెరిగి, 4,292.29 కిలోల బంగారం సీజ్ చేశారు.
2019–20లో 4,784 కేసులు నమోదై 3,626.85 కిలోల బంగారం స్వాధీనం కాగా, 2020–21లో కేసుల సంఖ్య 2,034కి తగ్గి, 1,944.39 కిలోల బంగారం మాత్రమే పట్టుబడింది. 2021–22లో 2,236 కేసులతో 2,172.11 కిలోల బంగారం స్వాధీనం కాగా, 2022–23లో కేసులు 4,619కి పెరిగి, 4,342.85 కిలోల బంగారం సీజ్ చేశారు. అత్యధికంగా 2023–24లో 6,599 కేసులు నమోదు కాగా, 4,971.68 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. 2024–25లో కేసుల సంఖ్య 3,005గా ఉండగా, 2,600.40 కిలోల బంగారం స్వాధీనం చేశారు.
ఈ గణాంకాలు చూస్తే, కొన్ని సంవత్సరాల్లో కేసుల సంఖ్య తగ్గినా, బంగారం స్వాధీనం పరిమాణం ఎక్కువగా ఉండటం గమనించదగ్గ విషయం. ఇది అక్రమ రవాణా మార్గాల్లో మార్పులు, తనిఖీల తీవ్రత, అంతర్జాతీయ ధరల ప్రభావం వంటి అంశాలపై దృష్టి సారించాల్సిన అవసరాన్ని సూచిస్తోంది.