భారతదేశం స్థూలంగా తక్కువ మధ్య ఆదాయ (లోయర్ మిడిల్ ఇన్‌కమ్) ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతున్నప్పటికీ దేశీయంగా కొన్ని రాష్ట్రాలు మాత్రం ఆదాయంలో దూసుకుపోతున్నాయి. ప్రపంచ బ్యాంకు నిర్దేశించిన దేశాల ఆర్థిక వర్గీకరణ గుర్తింపు, రాష్ట్రాల తలసరి ఆదాయ డేటాను విశ్లేషిస్తూ కొన్ని సంస్థలు అందించిన నివేదిక ప్రకారం.. భారతదేశంలోని ఐదు రాష్ట్రాలు ఇప్పటికే ప్రపంచ బ్యాంకు ఎగువ మధ్య ఆదాయ (అప్పర్ మిడిల్ ఇన్‌కమ్) పరిమితిని దాటేశాయి.
మరోవైపు కొన్ని రాష్ట్రాలు ఈ మైలురాయికి అత్యంత సమీపంలో ఉండగా మరికొన్ని రాష్ట్రాలు ఇప్పటికీ పేదరికంలో వెనుకబడి ఉండటం దేశీయ ఆర్థిక అసమానతలను స్పష్టం చేస్తోంది.
గ్లోబల్ బెంచ్‌మార్క్‌ను దాటిన రాష్ట్రాలు
ప్రపంచ బ్యాంకు నిబంధనల ప్రకారం, ఏ దేశం లేదా ప్రాంతం తలసరి ఆదాయమైనా 4,636 డాలర్ల నుంచి 14,375 డాలర్ల మధ్య ఉంటే దానిని ‘ఎగువ-మధ్య-ఆదాయ’ ఆర్థిక వ్యవస్థగా గుర్తిస్తారు. ఈ బెంచ్‌మార్క్‌ను అధిగమించి టాప్-5లో నిలిచిన భారతీయ రాష్ట్రాల వివరాలు..
| స్థానం | రాష్ట్రం / కేంద్రపాలిత ప్రాంతం | తలసరి ఆదాయం (డాలర్లలో) |
|---|---|---|
| 1 | ఢిల్లీ | 6,217 |
| 2 | కర్ణాటక | 5,579 |
| 3 | తెలంగాణ | 5,407 |
| 4 | తమిళనాడు | 5,329 |
| 5 | గుజరాత్ | 4,734 |
అడుగు దూరంలో మరిన్ని రాష్ట్రాలు
మరికొద్దిపాటి వృద్ధిని నమోదు చేస్తే ‘ఎగువ-మధ్య-ఆదాయ’ హోదాను అందుకోవడానికి మరో మూడు రాష్ట్రాలు సిద్ధంగా ఉన్నాయి. అందులో..
మహారాష్ట్ర: తలసరి ఆదాయం 4,628 డాలర్లు (బెంచ్‌మార్క్ కంటే కేవలం 8 డాలర్లు తక్కువ).
హరియాణా: తలసరి ఆదాయం 4,627 డాలర్లు (బెంచ్‌మార్క్ కంటే కేవలం 9 డాలర్లు తక్కువ).
కేరళ: తలసరి ఆదాయం 4,610 డాలర్లు (బెంచ్‌మార్క్ కంటే కేవలం 26 డాలర్లు తక్కువ).
ఒకవైపు కొన్ని రాష్ట్రాలు అంతర్జాతీయ ప్రమాణాల వైపు దూసుకుపోతుంటే, మరోవైపు దేశంలో ప్రాంతీయ అసమానతలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రాల పరిస్థితి దయనీయంగా ఉంది. అందులో అట్టడుగున బిహార్ ఉంది. కేవలం 984 డాలర్లు తలసరి ఆదాయంతో బిహార్ భారతదేశంలోనే పేద రాష్ట్రంగా మిగిలిపోయింది. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ (1,403 డాలర్లు), ఝార్ఖండ్ (1,470 డాలర్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
ఇదీ చదవండి: కలెక్టర్ల జీతభత్యాల మాటేంటి?


