బిలియనీర్ల హబ్‌గా భారత్‌! | India to have 313 billionaires by 2031 | Sakshi
Sakshi News home page

బిలియనీర్ల హబ్‌గా భారత్‌!

Apr 24 2026 5:24 AM | Updated on Apr 24 2026 8:04 AM

India to have 313 billionaires by 2031

51 శాతం పెరగనున్న కుబేరులు... 

2031 నాటికి 313 మంది 25,217కు అత్యంత ధనవంతులు 

నైట్‌ఫ్రాంక్‌ అధ్యయనం వెల్లడి

న్యూఢిల్లీ: భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్ల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా భారత్‌లో ప్రస్తుతం 207 మంది బిలియనీర్లు ఉంటే, 2031 నాటికి 51 శాతం పెరిగి 313కి చేరుకోనున్నట్టు నైట్‌ఫ్రాంక్‌ తెలిపింది. అత్యంత ధనవంతులు (అల్ట్రా హెచ్‌ఎన్‌ఐలు) 19,877గా ఉంటే, 2031 నాటికి వీరి సంఖ్య 25,217కు చేరుకోనుంది. 

బిలియన్‌ డాలర్లు, అంతకుమించి సంపద కలిగిన వారిని  బిలియనీర్లు (కుబేరులు)గా, 30 మిలియన్‌ డాలర్లు, అంతకుమించి ఆస్తులు కలిగిన వారిని అల్ట్రా హెచ్‌ఎన్‌ఐలుగా చెబుతారు. రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెంట్‌ అయిన నైట్‌ఫ్రాంక్‌ ఈ మేరకు 20వ ఎడిషన్‌ ‘ద వెల్త్‌ రిపోర్ట్, 2026’ను విడుదల చేసింది. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతోపాటు, వడ్డీ రేట్ల పెరుగుదల, అసమాన ఆర్థిక పరిస్థితులపై ఆందోళనలు నెలకొన్నప్పటికీ.. సంపద సృష్టి వేగంగా జరుగుతున్నట్టు ఈ నివేదిక పేర్కొంది. భారత్‌లో టెక్నాలజీ, ఇండ్రస్టియల్స్, క్యాపిటల్‌ మార్కెట్స్‌ రంగాల్లో అసాధారణ సంపద సృష్టి జరుగుతున్నట్టు తెలిపింది.  

రాజధానిగా ముంబై.. 
దేశంలోని అల్ట్రా హెచ్‌ఎన్‌ఐలలో 35.4 శాతం మందికి ముంబై చిరునామాగా ఉంది. అల్ట్రా హెచ్‌ఎన్‌ఐల జనాభా పరంగా భారత్‌ ప్రపంచంలో ఆరో స్థానంలో నిలిచింది. అంతర్జాతీయంగానూ అల్ట్రా హెచ్‌ఎన్‌ఐల సంఖ్య 2021లో ఉన్న 5,51,435 నుంచి 7,13,626కు పెరిగింది. గత ఐదేళ్లలో భారత్‌లో బిలియనీర్ల సంఖ్య 58 శాతం పెరిగి 2026లో 207కు చేరింది. ప్రపంచంలో బిలియనీర్ల సంఖ్యా పరంగా భారత్‌ మూడో స్థానంలో ఉంది. 

అత్యధికంగా అమెరికాలో 914 మంది ఉండగా, చైనాలో 485 మంది ఉన్నారు. ‘‘భారత్‌లో సంపన్నుల సంఖ్య పెరుగుతుండటం ఆర్థిక పరిణామ క్రమానికి అద్దం పడుతోంది. పారిశ్రామిక స్ఫూర్తితో ఎదుగుతూ.. బలమైన మూలధన నిల్వలు, అత్యాధునిక ఆర్థిక మార్కెట్లతో రాణిస్తోంది. వ్యవస్థాపకులు, పెట్టుబడిదారుల సమూహం పెరుగుతోంది. డిజిటలైజేషన్, లిస్టెడ్‌ కంపెనీలు, ప్రైవేటు క్యాపిటల్, కుటుంబ వ్యాపారాలు ఈ దిశగా కీలక పాత్ర పోషిస్తున్నాయి’’ అని నైట్‌ఫ్రాంక్‌ ఇండియా చైర్మన్, 
ఎండీ శిశిర్‌ బైజాల్‌ పేర్కొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement