
ఆదాయపు పన్ను డిపార్టుమెంటు వారు, ఒక్కో అస్సెస్సీకి సంబంధించిన అసెస్‌మెంట్ పూర్తి చేసినప్పుడు సమాచారం అడగడానికి అధికారాలు ఉన్నాయి. ఇప్పుడు అమల్లో ఉన్న చట్టం ప్రకారం 142 (1) సెక్షన్ కింద విస్తృత అధికారాలు ఉన్నాయి. ఈ మధ్యే ఒక అస్సెస్సీకి నోటీసులు వచ్చాయి. ‘‘మీరు మీ ఇంటి ఖర్చుల నిమిత్తం, సొంత వాడకాలు లేదా విత్‌డ్రాయల్స్ చాలా తక్కువగా చూపించారు. కాబట్టి మీ కుటుంబ సభ్యుల వివరాలు, వారి ప్రొఫైల్ వివరాలు, వారి పర్మనెంట్ అకౌంట్ నంబర్లు, వారి వార్షికాదాయం వివరాలు ఇవ్వండి’’ అనేది దాని సారాంశం. ఇవే కాకుండా ఈ కింది వివరాలు కూడా ఇవ్వాల్సి వచ్చింది.
⬩నెలవారీ రేషన్ వివరాలు. ఎంత కొన్నారు, ఏ రేటుకు కొన్నారు.
⬩గోధుమ పిండి ఎంత కొన్నారు..
⬩బియ్యం ఎంత?
⬩పప్పు ధాన్యాలెంత కొన్నారు..ఎంతకి కొన్నారు?
⬩నూనె ఎంత వాడారు.. ఎంతకు కొన్నారు?
⬩వంట గ్యాస్ వినియోగం వివరాలు.
⬩కరెంటు బిల్లెంత
⬩కొన్న బట్టల వివరాలు
⬩షూస్, పాలిష్, జోళ్లు వివరాలు
⬩క్షవరానికి ఎంత ఖర్చుపెట్టారు
⬩కాస్మెటిక్స్, స్ప్రేలు
⬩ఏయే వేడుకలు చేసుకున్నారు. ఖర్చెంత?
⬩పిల్లల చదువులు, పుస్తకాలు,
⬩స్కూల్ ఫీజుల వివరాలు
⬩మీరు చెల్లించే అద్దె వివరాలు
⬩కారు నిర్వహణ ఖర్చులు, ఇన్సూరెన్స్ ఎంత?
⬩హెల్త్ ఇన్సూరెన్స్ వివరాలు
⬩బిల్డింగ్ నిర్వహణ, ఇన్సూరెన్స్ వివరాలు
⬩జీవిత బీమా ప్రీమియం చెల్లింపులు
⬩చుట్టాలకు, స్నేహితులకు బహుమతులు ఏమిచ్చారు. వాటి విలువెంత?
⬩రెస్టారెంట్ల ఖర్చులెంత?
⬩గెట్‌టు గెదర్ లాంటి కార్యక్రమాల ఖర్చులు
⬩సంఘంలోని కార్యకలాపాలు, ఖర్చులు
⬩రోజువారీ ఖర్చులు
➤ఇలా అన్నింటి వివరాలూ ఇవ్వాలి. ఇంట్లో ఎంత మంది కుటుంబ సభ్యులున్నారో, వారందరి ఆదాయపు వివరాలు, ఖర్చుల వివరాలు, రుజువులతో సహా ఇవ్వాలి.
➤చివర్లో కొసమెరుపు.. కాదు కాదు.. బెదిరింపు ఏమిటంటే, ‘‘ఈ వివరాలు ఇవ్వకపోతే మీరు ప్రతి సంవత్సరం ఇంటి ఖర్చుల నిమిత్తం రూ. 10,00,000 విత్‌డ్రా చేసినట్లుగా భావిస్తాము’’ అని.
➤అలా భావిస్తే.. భావించారు.. అక్కడితో ఊరుకోరు. ఆ మొత్తం మీద పన్ను కూడా వేస్తారు.
అయితే, సాక్షి పాఠకలోకానికి ఈ అంశం కొత్త కాదు. మనం గతంలో ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఏ ఖర్చుకైనా ‘‘సోర్స్’’ ఉండాలి. సోర్స్‌కు సరైన వివరణ లేకపోతే ఆ ఖర్చును ఆదాయంగా భావిస్తారు.