ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది సెమీ ఎరిడ్ ట్రాపిక్స్ (ICRISAT).. రూపొందించిన సౌరశక్తితో పనిచేసే ''వాటర్ హైసింత్ హార్వెస్టర్'' జాతీయ గుర్తింపు పొందుతుంది. కాగా ఇప్పుడు ఇండియా ఇన్నోవేటర్స్ అసోసియేషన్ ద్వారా 2025లో టాప్ 100 ఇండియన్ ఇన్నోవేషన్లలో ఒకటిగా నిలిచింది. ఈ విషయాన్ని నవంబర్ 13న గోవాలో జరిగిన ఇండియా ఇంటర్నేషనల్ ఇన్నోవేషన్ అండ్ ఇన్వెన్షన్ ఎక్స్‌పో (INEX India)లో ప్రకటించారు.
సాధారణంగా నీరు నిల్వ ఉండే చోట.. నీటి మొక్కలు పుడతాయి. వీటి సంఖ్య ఎక్కువై.. జలాశయాలను మొత్తం ఆవరించినప్పుడు సమస్యలు ఏర్పడతాయి. ఇలాంటి సమస్యలను పరిష్కరించడానికి ఇక్రిశాట్ ఈ వాటర్ హైసింత్ హార్వెస్టర్ రూపొందించింది. వాటర్ హైసింత్ (ఒక రకమైన నీటిలో తేలియాడే మొక్కలు) జలమార్గాలకు ఆటంకాలను కలిగిస్తాయి. ఇవి జలచరాలకు సైతం ఊపిరాడకుండా.. నీటి నాణ్యతను కూడా దిగజారుస్తాయి. ఈ సమస్యలను వాటర్ హైసింత్ హార్వెస్టర్ పరిష్కరిస్తుంది.
వాటర్ హైసింత్ హార్వెస్టర్ పనిచేయడానికి కేవలం సూర్యరశ్మి సరిపోతుంది. ఎందుకంటే.. ఇది సోలార్ ప్యానెల్స్ పొందుతుంది. దీనిని ఉపయోగించడం ద్వారా కలుపును తొలగించవచ్చు. మొత్తం మీద ఇది పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణకు చాలా ఉపయోగపడుతుందని ఇక్రిశాట్ వెల్లడించింది.


