హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పౌల్ట్రీ ఇండియా ఎగ్జిబిషన్ 17వ ఎడిషన్ నవంబర్ 26 నుంచి 28 వరకు హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో నిర్వహించనున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ఎక్స్‌పోలో పౌల్ట్రీ పరిశ్రమ ఉత్పత్తులు, యంత్ర పరికరాలు, ఆవిష్కరణలు మొదలైనవి ప్రదర్శించనున్నారు. అలాగే, పౌల్ట్రీ రంగంలో కొత్త విధానాలు, సాంకేతికత, పరిశోధనలు, కెరియర్ అవకాశాలు తదితర అంశాలపై చర్చాగోషు్టలు ఉంటాయని ఇండియన్ పౌల్ట్రీ ఎక్విప్‌మెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (ఐపీఈఎంఏ) ప్రెసిడెంట్ ఉదయ్ సింగ్ బయాస్ బుధవారమిక్కడ విలేకరుల సమావేశంలో తెలిపారు.
దక్షిణాసియాలోనే అతి పెద్దదైన ఈ పౌల్ట్రీ ఎక్స్‌పోలో దేశ విదేశాలకు చెందిన 500 మంది పైగా ఎగ్జిబిటర్లు, 1,500 మంది ప్రతినిధులు పాల్గొంటారని, సుమారు 50 వరకు దేశాల నుంచి 45,000 మందికి పైగా సందర్శకులు వస్తారనే అంచనాలు ఉన్నాయని వివరించారు. ప్రస్తుతం భారతదేశం గుడ్ల ఉత్పత్తిలో రెండవ స్థానంలో, బ్రాయిలర్ మాంస ఉత్పత్తిలో నాలుగో స్థానంలో ఉందని చెప్పారు. మాంసం ఉత్పత్తిలో ప్రతి సంవత్సరం 8 నుంచి 10% వృద్ధి చెందుతోందని తెలిపారు. పౌల్ట్రీ పరిశ్రమ వేల్యూచెయిన్ ప్రస్తుతం సుమారు రూ. 4 లక్షల కోట్లుగా ఉండగా, వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించే నాటికి ఇరవై రెట్లు పైగా పెరిగే అవకాశం ఉందని ప్రధాన అతిథిగా పాల్గొన్న శ్రీనివాస ఫామ్స్ ఎండీ సురేష్ చిట్టూరి తెలిపారు.


