
టీమ్ వర్క్
చినుకు చినుకు కలిస్తే ప్రవాహం అయినట్టు చేయీ చేయీ కలిపితే విజయం చేరువ అవుతుందని అంటున్నారు కొందరు మహిళా గ్రూప్ సభ్యులు. ఇంటి వద్ద చిన్న చిన్న వ్యాపారాలు చేసే యాభై మంది మహిళలు వాట్సప్ ద్వారా ఒక జట్టుగా కలిశారు. ఒకరి కష్టనష్టాలను మరొకరితో పంచుకున్నారు... వ్యాపార మెళకువలను కలబోసుకున్నారు. నాలుగేళ్లుగా తమ నైపుణ్యాలను, సృజనాత్మకతను పంచుకుంటూనే వ్యాపారాలలో విజయాలు సాధిస్తున్నారు. రేపు ఆదివారం వీరంతా కలిసి సికింద్రాబాద్‌లోని ఎక్స్ పోచాణక్యలో తమ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు పంచుకున్న విషయాలు..
హస్తకళలు, క్లీనింగ్ అండ్ హైజీన్ ప్రొడక్ట్స్, ఫొటోగ్రఫీ, హెల్త్‌కేర్ సర్వీసెస్, ఈవెంట్ ΄్లానర్స్, స్నాక్స్ మేకర్స్, గిఫ్ట్ డీలర్స్, ఆర్కిటెక్ట్స్, ఇంటీరియర్ డిజైనర్లు.. ఇలా వివిధ వ్యాపారాలు నిర్వహిస్తున్న యాభైమంది మహిళలు ఒకచోట చేరి జట్టుగా విజయాలు సాధిస్తున్నారు. తమతోటి వారికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
ఒక ఫ్రెండ్ ద్వారా తెలిసి, రెండేళ్ల క్రితం ఈ గ్రూప్‌లో జాయిన్ అయ్యాను. రోజూ ఉదయం మేమంతా రెండు గంటలసేపు ఆన్‌లైన్ నెట్‌వర్క్ ద్వారా కలుసుకుంటాం. ఎవరికైనా ఏదైనా సమాచారం అవసరం ఉంటే.. ఆ విషయాలను పంచుకుంటాం. వెబ్ డిజైనింగ్, డిజిటల్ మార్కెటింగ్ చేసే స్టార్టప్‌ని రన్ చేస్తున్నాను. మా గ్రూప్‌లో ఎవరికైనా నా వర్క్ అవసరం ఉంటే వాళ్లు షేర్ చేస్తారు. నా వర్క్‌కి సంబంధించి ఏదైనా అవసరం ఉంటే, మా గ్రూప్ ఫ్రెండ్స్ నుంచి తీసుకుంటాను.
ఏడాదికి ఒకసారి పెట్టే స్టాల్ ద్వారా నాకు ఏదైతే అవసరం ఉంటుందో దాని గురించి నా డెస్క్ వద్ద రాస్తాను. ఎవరికైనా ఆ స్కిల్ ఉంటే, వర్క్‌లో జాయిన్ కావచ్చు. వారి వద్ద ఏదైనా ఎక్విప్‌మెంట్ ఉంటే మాకు అందజేయవచ్చు. ఇంట్లో ఉండి చిన్న చిన్న బిజినెస్‌లు చేసుకునే గృహిణులు, బయటకు రావాలంటే ఇబ్బందిగా ఫీలయ్యేవారు.. ఈ వేదిక ద్వారా ప్రయోజనాలు ΄÷ందాలనుకున్నాం. శిక్షణాతరగతులు కూడా నిర్వహిస్తుంటాం. మహిళల వ్యాపార వృద్ధికి జట్టుగా చేసే కృషి ఎంతగానో ఉపయోగపడుతుంది.
– లక్ష్మీ మోపిదేవి, ముగ్దా క్రియేటివ్స్, హైదరాబాద్
వ్యాపార విస్తరణకు సరైన మార్గం
వైష్ణో ఎంటర్‌ప్రైజెస్ పేరుతో హెల్తీ స్నాక్స్ తయారు చేస్తుంటాను. మిల్లెట్స్‌తో చేసే ఈ స్నాక్స్‌ని ఆర్డర్ మీద సప్లయ్ చేస్తుంటాను. నా వర్క్స్ గురించి ఈ గ్రూప్‌లోని స్నేహితులు స్టేటస్ పెడుతుంటారు. నేనూ వారి వర్క్స్‌ని స్టేటస్‌గా పెడుతుంటాను. దీని ద్వారా మా బంధుమిత్రులకు కూడా వారి వర్క్స్ చేరువవుతుంటాయి. మూడేళ్ల క్రితం ఈ విమెన్ గ్రూప్‌లో చేరాను. గ్రూప్ సభ్యులుగా వర్క్‌షాప్స్‌లో కలుస్తుంటాం. ఒకరికి ఒకరం సాయంగా ఉంటాం. మహిళలు ఒకరిగా కన్నా ఇలా సమష్టి్టగా కలిస్తే విజయాలు సులువుగా సాధించగలరు.
– శైలబాల, వైష్ణో ఎంటర్‌ప్రైజెస్, హైదరాబాద్
సృజనాత్మక పనికి చేయూత
నేను బడ్జెట్ ఫ్రెండ్లీ కస్టమైజ్డ్ గిఫ్ట్స్ తయారు చేస్తాను. ఏఐ టెక్నాలజీని ఉపయోగించి చేసే నా గిఫ్ట్ ఐడియాస్‌లో ఫొటో ఫ్రేమ్స్, స్క్రాప్ బుక్స్, ఫొటో ఆల్బమ్స్, వెడ్డింగ్ ఈవెంట్‌కి కావల్సిన గిఫ్ట్ ఐటమ్స్ ఉంటాయి. రెండేళ్ల క్రితం ఈ మహిళా గ్రూప్‌లో స్నేహితుల ద్వారా జాయిన్ అయ్యాను. నా వర్క్‌ని నా గ్రూప్‌లో ఉన్నవారే ప్రమోట్ చేస్తుంటారు. నేనూ ఈ గ్రూప్‌లోని కొంతమంది సభ్యులతో కొలాబరేట్ అయ్యి నా బిజినెస్‌ను పెంచుకుంటున్నాను. ప్రతి యేటా జరిగే ఈ ఎక్స్΄ోలో నా స్టాల్ ఉంటుంది. దీని ద్వారా నా వర్క్ మరింతమందికి రీచ్ అవుతున్నందుకు ఆనందంగా ఉంది.
– నాగవాణి, హైదరాబాద్
కాంటాక్ట్స్ పెరిగాయి
ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, వేణీ, రిటర్న్ గిఫ్ట్స్.. వంటివి తయారు చేస్తుంటాను. తెలిసిన వారి ద్వారా ఈ మహిళా గ్రూప్‌లో చేరాను. దీంతో నాకు కాంటాక్ట్స్ పెరిగాయి. మిగతావారితో కలిసి నా బిజినెస్‌ను ఎలా డెవలప్ చేసుకోవచ్చో తెలిసింది. లీడర్‌షిప్ క్వాలిటీస్ నేర్చుకున్నాను. వర్క్‌షాప్స్ కూడా నిర్వహించుకుంటాం. లోన్ మేళా, హెల్త్‌క్యాంప్స్ ఏర్పాటు చేస్తుంటాం.
– దుర్గ గరిమెళ్ళ,విపంచిక ట్రెండ్స్, హైదరాబాద్
– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి