వచ్చే ఏడాది ఫార్మా రంగం కళకళ!

Icra says Domestic pharma industry revenues expected to grow 6 to 8 pc - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశీయ ఔషధ పరిశ్రమ వచ్చే ఆర్థిక సంవత్సరంలో 6-8 శాతం ఆదాయ వృద్ధి నమోదు చేస్తుందని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది. ‘విఘాతం కలిగించే అనేక సంఘటనలు ఉన్నప్పటికీ 2011-12 నుంచి 2021-22 మధ్య ఫార్మా రంగం 10.9 శాతం వార్షిక వృద్ధి నమోదు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 3-4 శాతానికి పరిమితం కానుంది.

వృద్ధులు, జీవనశైలి/దీర్ఘకాలిక వ్యాధుల నిరంతర పెరుగుదల, జాతీయ జాబితాలోని అత్యవసర ఔషధాలకు (ఎన్‌ఎల్‌ఈఎం) టోకు ధరల ఆధారంగా ధరల పెంపు, కొత్త ఉత్పత్తుల విడుదల, ఎన్‌ఎల్‌ఈఎంయేతర ఔషధాలకు వార్షిక ధరల పెంపు వంటి నిర్మాణాత్మక అంశాలు పరిశ్రమ ఆదాయ వృద్ధికి తోడ్పడతాయి. 2017–18 నుండి ప్రతి ఆర్థిక సంవత్సరంలో పరిమాణ వృద్ధి 2-3 శాతం మధ్య ఉన్నప్పటికీ, ధరల పెరుగుదల, కొత్త ఉత్పత్తుల రాకతో ఔషధ రంగం జోరుకు మద్దతు లభించింది’ అని ఇక్రా తెలిపింది. (టాటా, మారుతి, హ్యుందాయ్‌: కారు ఏదైనా ఆఫర్‌మాత్రం భారీగానే!)

కొత్త ఉత్పత్తులు, సిబ్బంది పెంపు.. ‘యాంటీ-ఇన్‌ఫెక్టివ్‌ల అధిక విక్రయాలు, ముడిసరుకు వ్యయాల ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు తీసుకున్న ధరల పెరుగుదలతో 2021-22లో మొత్తం ఫార్మా పరిశ్రమ వృద్ధి 14.6 శాతానికి చేరుకుంది. 2022-23 ఏప్రిల్‌-డిసెంబర్‌ కాలానికి పరిమాణం 1.2 శాతం తగ్గింది. కొత్త ఉత్పత్తుల పరిచయం, క్షేత్ర స్థాయిలో ఉద్యోగుల పెంపు దిశగా తీసుకుంటున్న చర్యలు ఫార్మా వృద్ధికి తోడ్పడతాయని కంపెనీలు భావిస్తున్నాయి.

దేశీయ ఔషధ విపణిలో ఎన్‌ఎల్‌ఈఎం వాటా 17-18 శాతంగా ఉంది. కొన్ని కంపెనీలకు వీటి ద్వారా 30 శాతం వరకు ఆదాయం సమకూరుతోంది. పరిశ్రమలో అభివృద్ధి చెందుతున్న ధోరణులపరంగా ఈ-ఫార్మసీలు ఇటీవలి కాలంలో గణనీయమైన ఆకర్షణను పొందాయి. ప్రస్తుతం ఫార్మా రంగంలో వీటి వాటా 10-15 శాతం ఉంది’ అని ఇక్రా వివరించింది. (రూ. 32 వేల బెస్ట్‌ సెల్లింగ్‌ స్మార్ట్‌ఫోన్‌ కేవలం రూ. 1,999కే)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top